విశాఖ మన్యంలో కొండలూ కోనల మధ్య ఉన్న గ్రామాలు కోకొల్లలు. శాస్త్రసాంకేతిక అభివృద్ధి చెందిన ఈ రోజుల్లోనూ 10 శాతం గ్రామాలకే రోడ్ల సౌకర్యముంది. మిలిగిన ఎత్తైన కొండల్లో నివాసముంటున్న గిరిజనులు ఇప్పటికీ రాకపోకలు ఇబ్బందులు పడుతున్నారు. రహదారి లేకపోవటంతో నిత్యజీవితంలో ప్రతి అంశంలోనూ కష్టాలు పడుతున్నారు. పిల్లలు పాఠశాలలకు దూరమై, పండిన పంటలు తీసుకెళ్లి అమ్ముకోలేక, పురిటినొప్పులు పడుతున్న గర్భిణులను ఆసుపత్రికి తీసుకెళ్లలేక నిత్యావసర సరుకులు తెచ్చుకోలేక ఇలా కష్టాల జాబితా చెప్పుకుంటూపోతే అంతే ఉండదు.
రోడ్డు నిర్మించి తమ కష్టాలు తీర్చండని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులుగానీ, నేతలు గానీ పట్టించుకోలేదు. చూస్తూ కూర్చుంటే తమ బతుకులు మారవని భావించిన హుకుంపేట మండలం గుర్రాలతోట పైవీధి గ్రామస్థులు..చందాలు వేసి రోడ్డు నిర్మించుకుంటున్నారు. పాక్షిక లాక్‌డౌన్‌తో వలస వెళ్లినవాళ్లంతా సొంతూళ్లకు చేరుకున్నారు. అందరూ గ్రామంలో ఉండటంతోనే చిన్నాపెద్దా కలసి 3 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించేందుకు నడుంబిగించారు. శ్రమదానం చేసి ఇప్పటికే కిలోమీటర్ మేర రోడ్డు పూర్తిచేశారు. పెద్దపెద్దరాళ్లను తొలగించేందుకు చందాలువేసుకుని జేసీబీ తెచ్చుకున్నారు.