విశాఖలోని పలు చోట్ల చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన రెండు ముఠాలను విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. నగరానికి చెందిన ఐదు గురు సభ్యులు రెండు ముఠాలుగా ఏర్పడి నగర శివార్లు, జనసంచారం తక్కువగా ఉండే ప్రదేశాలలో నడిచి వెళ్లే మహిళలను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్నట్లు నగర నేర విభాగాపు డీసీపీ వి.సురేశ్ బాబు తెలిపారు.
గాజువాక, న్యూ పోర్ట్, 2టౌన్ పరిధిలో వరుసగా జరిగిన ఘటనలపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడ్డారు. ఆదివారం సాయంత్రం గాజువాకలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వాళ్లను అదుపులోకి తీసుకుని విచారించగా స్నాచింగ్ వ్యవహారం బయటపడిందని డీసీపీ వివరించారు. ఇందులో ముగ్గురు బాల నేరస్థులు ఉన్నట్లు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 124 గ్రాముల బంగారు ఆభరణాలు, 4 ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ద్విచక్రవాహనంపై వచ్చి అడ్రస్ అడుగుతున్నట్లు నటిస్తూ.. వెనక కూర్చున్న వ్యక్తి అదను చూసుకుని మహిళ మెడలోని గొలుసును లాక్కెళ్లిపోతారు. మహిళలు ఒంటరిగా వెళ్లేప్పుడు జాగ్రత్తగా ఉండాలని డీసీపీ సూచించారు.