ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వైకాపా నేతలు రాజీనామా చేస్తే నిమిషంలో మేము చేస్తాం' - చంద్రబాబు తాజా వార్తలు

ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సాగే ఉద్యమానికి మద్దతుగా వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేస్తే ఒక్క నిమిషంలోనే తామూ రాజీనామా చేస్తామని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు.

వైకాపా నేతలు రాజీనామ చేస్తే నిమిషంలో రాజీనామా చేస్తాం
వైకాపా నేతలు రాజీనామ చేస్తే నిమిషంలో రాజీనామా చేస్తాం

By

Published : Feb 17, 2021, 6:27 AM IST

Updated : Feb 17, 2021, 6:40 AM IST

ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సాగే ఉద్యమానికి మద్దతుగా వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేస్తే ఒక్క నిమిషంలోనే తామూ రాజీనామా చేస్తామని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ‘సీనియర్‌ నాయకుడిననే అహం లేకుండా పరిశ్రమను కాపాడుకోవడానికి సీఎం ఏది చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నా. ప్రజలకు సహకరించేందుకు ఏం చేయాలో అన్నీ చేస్తా. ఈ విషయంలో ప్రభుత్వంపైనే ఎక్కువ బాధ్యత ఉంది’ అని ఆయన పేర్కొన్నారు.

పల్లా దీక్షను భగ్నం చేశారు : చంద్రబాబు

స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను సోమవారం అర్ధరాత్రి పోలీసులు భగ్నం చేశారు. సమీప ప్రైవేటు ఆసుపత్రికి ఆయన్ని తరలించారు. పల్లా శ్రీనివాసరావుకు సంఘీభావం తెలిపేందుకు మంగళవారం విశాఖకు వచ్చిన చంద్రబాబు ఆసుపత్రిలో ఆయన్ని పరామర్శించారు. నిమ్మరసమిచ్చి దీక్ష విరమింపజేశారు. అలాగే కూర్మన్నపాలెం స్టీల్‌ప్లాంటు ప్రవేశద్వారం వద్ద అఖిలపక్ష కార్మిక సంఘాలు, ఉక్కు నిర్వాసితుల సంఘాలు చేపట్టిన దీక్షా శిబిరాల వద్దకు చేరుకొని మద్దతు తెలిపారు.

మనం ఒక ఎత్తు, సర్కార్ ఒక ఎత్తు..

‘ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కు తీసుకునేంత వరకు తెదేపా పోరాడుతుంది. మనందరం ఒక ఎత్తయితే, రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎత్తు. ప్రజలంతా కలిసి ఒక ప్రభుత్వానికి అధికారమిచ్చారు. ఆ ప్రభుత్వం ప్రజల హక్కులు, మనోభావాలను కాపాడాలి. ఈ విషయంలో ప్రతిపక్షంగా సహకరించాల్సిన బాధ్యత మాపై ఉంది’ అని చంద్రబాబు పేర్కొన్నారు. తెలుగువారు ఉక్కు సంకల్పంతో సాధించుకున్న పరిశ్రమను అమ్మేస్తామంటే నాటి త్యాగాలకు సీఎం జగన్‌ ఎక్కడ విలువ ఇచ్చినట్టని ప్రశ్నించారు.

వారి త్యాగం విలువ రూ.2 లక్షల కోట్లు

‘అప్పట్లో రైతులు త్యాగం చేసిన భూముల మార్కెట్‌ విలువ రూ.2 లక్షల కోట్లకు పెరిగింది. వారికి న్యాయం జరగకపోగా విలువైన స్టీల్‌ప్లాంటును అమ్ముకుంటామంటున్నారు. వీళ్లంతా రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేసుకుంటారు’ అని విమర్శించారు.

ముఖ్యమంత్రి పబ్‌జీ ఆడుకుంటున్నారా?

‘స్టీల్‌ప్లాంటును అమ్మకానికి పెడితే ముఖ్యమంత్రి ఎక్కడికెళ్లారు ? ఆయన ఎందుకు మాట్లాడరు ? తాడేపల్లిలో ఏం చేస్తున్నారు ? పబ్‌జీ ఆడుకుంటున్నారా ?’ అని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్ర హక్కులను కాపాడలేక ప్రజల సెంటిమెంట్‌ను అమ్ముకోవాలని చూసే వ్యక్తికి ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత ఉందా? అని ప్రశ్నించారు. ‘దొంగ నాటకాలు ఆడుతున్నారు. స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణ అంశం మీ దృష్టికి రాలేదా ? ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా ? ప్రజల్ని మోసం చేయాలని చూస్తారా ?’ అని ప్రశ్నించారు.

ప్రజలు తిరగబడితే..

విశాఖ ఆత్మ స్టీల్‌ప్లాంటు అని, దాన్ని దోచేయాలనే ఆలోచన వైకాపాకు ఉండడం దుర్మార్గమని విమర్శించారు. ‘పోలీసులతో కేసులు పెట్టిస్తామని 2,3 రోజులు బెదిరించొచ్చు. ప్రజలు తిరగబడితే వైకాపా నాయకులు రోడ్డుపై తిరగలేరు. విశాఖను ఆర్థిక రాజధానిగా ఎప్పుడో నిర్ణయించి ఐటీ, లులూ వంటి అంతర్జాతీయ సంస్థలను తీసుకొస్తే వీళ్లిక్కడ భూదందాలకు పాల్పడుతున్నారు’ అని విమర్శించారు.

పాదయాత్ర పేరిట మోసం..

‘ఇక్కడున్న ఏ2 విజయసాయిరెడ్డి 20 కి.మీ.పాదయాత్ర చేస్తారట ? ఎవరిని మోసం చేయడానికి ? మీరు పాదయాత్ర చేయాల్సిన అవసరం లేదు. దిల్లీకి వెళ్లి ప్రశ్నించు. లేకపోతే పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లి పడుకో’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘పోస్కో ప్రతినిధులు విశాఖకు వచ్చారు. అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఏ2 ఏం చేస్తున్నారు ? దొడ్డిదారిన అన్నీ కొట్టేసినట్లు విశాఖ స్టీల్‌ను చుట్టేయాలని పథకం వేస్తే కథ అడ్డం తిరిగింది. అందుకే నాటకాలు మొదలుపెట్టి పాదయాత్ర చేస్తాం.. పోరాడుదామని అంటున్నారు.

అది కొనాలని చూస్తే గుండెల్లో నిద్రపోతా..

పోరాటాలను తెదేపాకు నేర్పాల్సిన పని లేదు. త్యాగాలను ఎవరైనా కొనేయాలనుకుంటే వారి గుండెల్లో నిద్రపోతా’ అని పేర్కొన్నారు. పల్లా శ్రీనివాసరావు 6రోజులపాటు ఆమరణ నిరాహార దీక్ష సంఘీభావానికి కనీసం ఒక్క మంత్రి కూడా రాలేదని వివరించారు. దొంగ స్వామికి మొక్కేందుకు ఇక్కడికి వస్తుండటం దురదృష్టకరమని పేర్కొన్నారు. నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకునే వరకు పోరాడతామన్నారు. కలిసి ఉద్యమిద్దామంటూ ప్రజలతో నినాదాలు చేయించారు. ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన పల్లా శ్రీనివాసరావు త్యాగాన్ని అందరూ అభినందించాలని, ఆయన దీక్ష భగ్నం చేయడం రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు.

ఇదీ చదవండి

నేడు విశాఖలో పర్యటించనున్న సీఎం జగన్

Last Updated : Feb 17, 2021, 6:40 AM IST

ABOUT THE AUTHOR

...view details