విశాఖ నగర నడిబొడ్డున ఉన్న కోట్ల రూపాయల విలువ చేసే చర్చి భూములను కాజేసేందుకు ముఖ్యమంత్రి జగన్, వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ప్రణాళిక రచించారని తెదేపా నేతలు ఆరోపించారు. ఎమ్మెల్సీ డి.రామారావుతో కలిసి మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి, విశాఖ లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెదేపా నగర కార్యాలయంలో శనివారం విలేకర్లతో మాట్లాడారు. విశాఖ నగరం సీబీఎం కాంపౌండ్ ప్రాంతంలో జీవీఎంసీ కమిషనర్ బంగ్లా పక్కనే సీబీసీఎన్‌సీ (కన్వెన్షన్ ఆఫ్ బాప్టిస్ట్ చర్చెస్ ఆఫ్ నార్తరన్ సర్కార్స్) చర్చికి 15వేల చదరపు గజాల స్థలం ఉందని చెప్పారు. ఈ భూమికి రిసీవర్‌గా కలెక్టర్‌ను నియమిస్తూ 2009లో హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. అయితే వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జారీచేసిన 900 జీఓను అడ్డంపెట్టుకొని ప్రస్తుత జగన్ సర్కారు రత్నాకర్ హెగ్డే అనే వ్యక్తికి ఆ స్థలంలో విల్లాలు కట్టుకునేందుకు అనుమతులిచ్చిందని, ఇప్పటికే అక్కడ నిర్మాణాలు ప్రారంభమయ్యాయని ఆరోపించారు. అక్కడ విల్లాల నిర్మాణానికి జీవీఎంసీ అనుమతులు ఎలా ఇస్తుందని ప్రశ్నించారు.
వ్యక్తి పేరుతో టైటిల్ ఇచ్చిందీ లేనిదీ జేసీ, కలెక్టర్, జీవీఎంసీ అధికారులు స్పష్టం చేయాలన్నారు. ఇక్కడి నిర్మాణాలను క్రిస్టియన్లంతా ప్రశ్నిస్తున్నారని, దీనిపై అధికారులు స్పందించకపోవడం విచారకరమన్నారు. వివాదాస్పద భూముల్లో కడుతున్న విల్లాలను ప్రజలు కొనవద్దని, భవిష్యత్తులో దీనిపై విచారణ జరుగుతుందని అన్నారు. యూఎల్‌సీ (అర్బన్ ల్యాండ్ సీలింగ్) చట్టం ప్రకారం ఒక వ్యక్తి 1500 గజాల లోపే స్థలం కలిగి ఉండాలని, మరి ఇక్కడ రత్నాకర్ హెగ్డేకి 15,000 గజాల స్థలాన్ని ఎలా అప్పగించారని ప్రశ్నించారు. ఈ విషయమై తాము న్యాయపోరాటం చేస్తామని, 2009లో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కలెక్టరు అమలుచేయాలని డిమాండుచేశారు.