ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అది వైసీపీ మైండ్​ గేమ్​.. మా అభ్యర్థి అనురాధ గెలవబోతున్నారు: గంటా

TDP LEADER GANTA CLARITY ON HIS RESIGNATION: తన రాజీనామాను స్పీకర్​ ఆమోదించారంటూ వస్తున్న ఆరోపణలపై టీడీపీ నేత, విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పందించారు. అది కేవలం వైసీపీ ఆడుతున్న మైండ్​ గేమ్​ మాత్రమే అన్నారు.

TDP LEADER GANTA CLARITY ON HIS RESIGNATION
TDP LEADER GANTA CLARITY ON HIS RESIGNATION

By

Published : Mar 23, 2023, 11:39 AM IST

TDP LEADER GANTA CLARITY ON HIS RESIGNATION: రాష్ట్రంలో రాజకీయం వాడీవేడిగా సాగుతోంది. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. సై అంటే సై అంటూ పోటికీ దిగుతున్నారు. ఇది ఇలా ఉంటే ఈరోజు జరుగుతున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం తమదే అని అటు అధికార వైసీపీ.. ఇటు ప్రతిపక్ష టీడీపీ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. 16 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్​లో ఉన్నారని తెలుగుదేశం నేతలు వ్యాఖ్యానిస్తుంటే.. వైసీపీ మాత్రం దానిని కొట్టిపారేస్తోంది. టీడీపీ మైండ్​ గేమ్​ ఆడుతోందని విమర్శలు గుప్పిస్తోంది. అయితే ఈ క్రమంలో గంటా శ్రీనివాసరావుపై సోషల్​ మీడియాలో ఓ ప్రచారం సాగుతోంది. దీనిపై స్పందించిన గంటా కీలక వ్యాఖ్యలు చేశారు.

తన రాజీనామా ఆమోదం అంటూ గత రాత్రి నుంచి జరిగే ప్రచారం.. వైసీపీ ఆడే మైండ్ గేమ్ మాత్రమేనని విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. దానిపై తనకు ఎలాంటి సమాచారం లేదని ఆయన అన్నారు. అధికార పార్టీ తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి తన రాజీనామాను అమోదించారనే ప్రచారం పెట్టారని గంటా ఆరోపించారు. టీడీపీలో ఓ ఎమ్మెల్యే ఓటు వేయలేకపోతున్నారనే ఫీలింగ్ కలిగించాలనే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇలా చేస్తే.. వైసీపీ అసంతృప్తులు వెనక్కు తగ్గుతారనేది ఆ పార్టీ ఆలోచనగా పేర్కొన్నారు.

"నా రాజీనామా ఆమోదమంటూ రాత్రి నుంచి దుష్ప్రచారం చేస్తున్నారు. రెండేళ్ల క్రితం రాజీనామా చేసి స్పీకర్‌నూ వ్యక్తిగతంగా రెండు సార్లు కలిశా. అప్పటి నుంచి ఆమోదించని రాజీనామా గంటలో ఓటింగ్ అనగా ఆమోదిస్తారా?. మా అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలవబోతున్నారు"-గంటా శ్రీనివాసరావు, విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే

రెండేళ్ల క్రితం రాజీనామా చేసి స్పీకర్​ను కూడా వ్యక్తిగతంగా 2సార్లు కలిశానన్న గంటా.. అప్పటి నుంచి ఆమోదించని రాజీనామా గంటలో ఓటింగ్ అనగా ఆమోదిస్తారా అంటూ ప్రశ్నించారు. ఓటర్ లిస్టు వచ్చాక రాజీనామా ఆమోదించడం అనేది సాంకేతికంగా కుదరదు అన్న ఆయన.. అలా చేస్తే వైసీపీ పెద్ద తప్పు చేసినట్టే అని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం అభ్యర్థి పంచుమర్తి అనూరాధ నామినేషన్ పత్రాలపై ప్రపోజల్ సంతకం తనదేనన్న గంటా శ్రీనివాసరావు.. తమ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు.

మరోవైపు టీడీపీ ఆత్మప్రభోదానుసారం అనే అంశాన్ని అనూహ్యంగా తెర మీదకి తెచ్చింది. వైసీపీపై అసంతృప్తి ఉన్న నేతలు తమ పార్టీకి ఓట్లు వేస్తారని టీడీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పట్టభద్రుల్లో గెలిచినట్లే.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం గెలిచి విజయ కేతనం ఎగురవేస్తాం అంటున్నారు.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గంటాపై సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణను నిరసిస్తూ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ స్పీకర్‌కు లేఖ పంపించారు. అయితే ఆ రాజీనామాను ఇప్పుడు ఆమోదించారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. దీంతో గంటా స్పందించి ఆ అంశంపై క్లారిటీ ఇచ్చారు. కొందరు టీడీపీ నేతలు కూడా దీనిపై స్పందించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details