Complaint against AU Vice Chancellor: వైసీపీ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీ అభ్యర్థులకు మద్దతుగా బహిరంగ సమావేశాల్ని నిర్వహిస్తూ అధికారాన్ని దుర్వినియోగానికి పాల్పడుతున్న ఆంధ్రా విశ్వవిద్యాలయ ఉపకులపతి(వీసీ) పీవీజీడీ ప్రసాద్ రెడ్డిపై, కడప ఆర్జేడీ(పాఠశాల విద్య) ప్రతాప్‌రెడ్డిపై రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, వైసీపీ తొత్తులా వ్యవహరిస్తున్న వీసీ ప్రసాద్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విశాఖ దసపల్లా హోటల్లో వైసీపీ ఇన్చార్జ్ వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు కోసం నిర్వహించిన సమావేశానికి వీసీ ఎలా హాజరయ్యారంటూ నిలదీశారు. పక్కాగా రాష్ట్రవ్యాప్తంగా అటు ఉపాధ్యాయ ఎన్నికలు, పట్టభద్రుల ఎన్నికల్లో ప్రసాద్ రెడ్డికి బాధ్యతలిచ్చి ఎలాగైనా ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గెలవాలనే లక్ష్యంతో అధికార పార్టీ ఉందని ధ్వజమెత్తారు. తక్షణమే వీసీ ప్రసాద్ రెడ్డిని సస్పెండ్ చేయాలని, ఒక్క క్షణం కూడా కడప ఆర్జేడీని కొనసాగించడం తగదని, వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ ప్రసాద్‌రెడ్డి గారు ఆయన ముందు నుంచి కూడా వైసీపీ కార్యకర్తలానే పని చేస్తున్నారు. విశాఖ దసపల్లా హోటల్లో వైసీపీ ఇన్చార్జ్ వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు కోసం నిర్వహించిన సమావేశానికి వీసీ వెళ్లారంటే ఇంత దారుణం ఏ రోజైనా ఉందా .- రామకృష్ణ,సీపీఐ రాష్ట్ర కార్యదర్శి