State Bandh for Vizag Steel Plant: విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణ కోసం వామపక్ష విద్యార్థి సంఘాలు నవంబర్ 8వ తేదీన రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా విశాఖలోని సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (AISF) విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు బంద్ వివరాలను తెలియజేశారు.
విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణ కోసం చేస్తున్న ఉద్యమం 1000 రోజులకు చేరుకున్న సందర్భంగా విద్యార్థి సంఘాలు బంద్ చేయాలని నిశ్చయించాయని వివరించారు. అదే విధంగా కడప ఉక్కు కర్మాగారం ప్రారంభించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయని నాగరాజు తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగారం మూడు లక్షల కోట్ల విలువైన ఆస్తిని కేవలం 30 వేల కోట్లకు అదానీకి విక్రయించేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం.. రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి సర్కార్ సిద్ధమవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Vizag Steel: విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు
రాష్ట్రంలో నూతన పరిశ్రమలను ఏర్పాటు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందడం వల్ల యువతకు ఉద్యోగ అవకాశాలు లభించే వీలు లేకుండా పోయిందని మండిపడ్డారు. రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చూస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం మద్దతు తెలుపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేకపోయారని విమర్శించారు. విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణ కోసం విద్యార్థి సంఘాలు చేపడుతున్న విద్యాసంస్థల బంద్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని వెల్లడించాలని డిమాండ్ చేశారు.