మాటలు నేర్చింది మొదలు.. గుక్క తిప్పకుండా మాట్లాడేవరకూ.. మనం మాతృభాషను పలకని సందర్భం ఊహించగలమా..? తెలుగువారు ఎక్కడుంటేనేం.. నిద్ర లేవడంతో ప్రారంభించి.. వినసొంపైన మాటలతోనో.. హాయిగొలిపే పాటలతోనో.. రోజు గడిపేస్తూ ఉంటారు. ఇక్కడ విద్యార్థినులు చేస్తోందీ ఇదే..! భాషపై మక్కువ ఉన్న గురువు కల్పించిన ఆసక్తితో.. గ్రంథాలయంలో పుస్తకాలు తిరగేస్తూ.. తెలుగును ఔపోశన పట్టేస్తున్నారు.
ఆరువేల పుస్తకాలతో గ్రంథాలయం..
ఈ మాస్టారు పేరు రాంబాబు..! ఈయన విశాఖ జిల్లా అనకాపల్లి మండలం సీతానగరం పాఠశాలకు భాషా పండితుడిగా వచ్చిన కొత్తలో.. సుమారు వెయ్యి పుస్తకాలు బీరువాలో మూలుగుతున్నాయి. ఈ పరిస్థితిని మార్చాలని సంకల్పించిన మాస్టారు.. పుస్తక పఠనం విలువైనదని చాటి చెప్పేందుకు పుస్తకాలను విద్యార్థులకు అందుబాటులో ఉండేలా చేశారు. ప్రధానోపాధ్యాయుడు, గ్రామస్థుల సహకారంతో.. సుమారు 6 వేల పుస్తకాలతో బడిలో గ్రంథాలయం ఏర్పాటు చేశారు.
ఆ గదిలోనూ పుస్తకాలు..
గ్రంథాలయంలో విద్యార్థులతో రోజూ పుస్తకాలు చదివిస్తూ.. సెలవు రోజుల్లో 2 పుస్తకాలను ఇచ్చి ఇళ్లకు పంపిస్తున్నారు. బడిలో గ్రంథాలయం ఏర్పాటుతో ఆగిపోని రాంబాబు మాస్టారు.. రామమందిరానికి చెందిన గదిలోనూ చిన్న లైబ్రరీ ఏర్పాటు చేశారు. స్థానికుల విరాళాలతో.. ర్యాక్‌లు, రెండు కంప్యూటర్లు పెట్టారు. పాఠశాలకు పోలీసులు ఒక కంప్యూటర్, ప్రొజెక్టర్ అందజేశారు.