ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేడు సింహాద్రి అప్పన్న వార్షిక కల్యాణం - సింహాద్రి అప్పన్న

సింహాద్రి అప్పన్న కల్యాణ మహోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఈ రోజు స్వామి కల్యాణం, రథోత్సవాన్ని నిర్వహించనున్నారు. భక్తులకు అన్న ప్రసాదం, రవాణా సౌకర్యాలు కల్పించారు.

నేడు సింహాద్రి అప్పన్న వార్షిక కల్యాణ మహోత్సవం నిర్వహించున్నారు.

By

Published : Apr 16, 2019, 12:46 PM IST

Updated : Apr 17, 2019, 7:07 AM IST

విశాఖ జిల్లా సింహాచలంపై కొలువైన అప్పన్నకు... కల్యాణోత్సవం జరగనుంది. అంకురార్పణతో ప్రారంభమైన స్వామివారి వార్షిక వేడుకలో భాగంగా.. ఈ రోజు రాత్రి 8 గంటలకు రథోత్సవం, అనంతరం 9 గంటల 30 నిమిషాలకు కల్యాణోత్సవం నిర్వహిస్తారు. ఈ నెల 20వ తేది పుష్ప యాగంతో ఉత్సవాలు పూర్తవుతాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామికి ప్రత్యేక పూజలు జరగనున్నాయి.

  • మధ్యాహ్నం 3.45 గంటలకు కొట్నాల ఉత్సవంలో భాగంగా పసుపు కొమ్ములు దంచుతారు.
  • 4 గంటలకు గ్రామ బలిహరణ కార్యక్రమం నిర్వహిస్తారు.
  • సాయంత్రం 6.30 గంటలకు ఎదురు సన్నాహ ఉత్సవంలో భాగంగా స్వామి, అమ్మవారి వేర్వేరు పల్లకీల్లో మాఢవీధుల్లో జోడు భద్రాల వద్ద ఎదురు సంవాద కార్యక్రమంలో పాల్గొంటారు.
  • స్వామి, అమ్మవార్ల వైశిష్ట్యాన్ని ఇరువర్గాలకు తెలియపరిచి వివాహానికి ఒప్పించే ప్రక్రియను నాటకీయంగా ప్రదర్శిస్తారు.
  • రాత్రి 8 గంటలకు స్వామి వారి రథోత్సవం ప్రారంభమవుతుంది.
  • ఉత్సవం ముగిశాక నృసింహ మండపం ఆవరణలోని కల్యాణ వేదికపై స్వామి అమ్మవార్ల పరిణయ మహోత్సవం శోభాయమానంగా జరిపిస్తారు.
  • ఉత్సవం జరుగుతున్న సమయంలోనే రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు భక్తులకు స్వామి దర్శన భాగ్యం కల్పిస్తారు.

భక్తులకు విస్తృత ఏర్పాట్లు...

ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు మధ్యాహ్నం, రాత్రి ఉచిత అన్న ప్రసాదం అందించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సింహగిరి నుంచి తిరిగి వెళ్లేందుకు రాత్రి 12 గంటల వరకూ బస్సు సౌకర్యం కల్పించారు.

Last Updated : Apr 17, 2019, 7:07 AM IST

ABOUT THE AUTHOR

...view details