దేశంలో రెండోది.. రాష్ట్రంలో మొదటిది అయిన ఉదయ్ ఎక్స్‌ప్రెస్ డబుల్ డెక్కర్ రైలు ఈ నెల 27 న పట్టాలెక్కనుంది. పూర్తి ఏసీ డబుల్ డెక్కర్ బోగీలతో ఉన్న ఈ రైలు విశాఖపట్నం - విజయవాడ మధ్య రాకపోకలు చేయనుంది. ప్రస్తుతం ఈ తరహా రైలు బెంగళూరు సిటీ - కోయంబత్తూరుల మధ్య నడుస్తోంది. ఆధునిక రైల్వేలలో ఉదయ్ ఎక్ప్రెస్ పేరిట రెండతస్థుల రైలు (డబుల్ డెక్కర్ రైలు) ఇప్పుడు ప్రయాణికులను ఆకట్టుకుంటోంది. ఇప్పుడు విశాఖ -విజయవాడల మధ్య డే ట్రైన్‌గా నడవనుంది.
ప్రతి కోచ్‌లోనూ పై అంతస్తు, కింది అంతస్తులలో కలిపి మొత్తం 120 సీట్లు ఉంటాయి. 50 సీట్లు పై డెక్‌లోనూ, 48 సీట్లు కింది డెక్‌లోనూ ఉండగా... బోగీకి ఇరువైపులా 22 సీట్లను ఏర్పాటు చేశారు. గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వీలున్న ఈ రైలులో వైఫై కాఫీ, టీలు విక్రయించే మిషన్లు, టీవీ ఏర్పాటు చేశారు. ప్రయాణీకులకు బోర్ అనిపించినపుడు నలుగురు నిల్చుని కబుర్లు చెప్పుకునేందుకు వీలుగా ప్రతి బోగీలోనూ ప్రత్యేకంగా స్ధలాన్ని నిర్దేశించారు.