విశాఖ జిల్లా నర్సీపట్నంలో తొలిసారిగా రెండు కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తమైంది. పట్టణంలో పలువార్డులను రెడ్జోన్లుగా ప్రకటించారు. జన, వాహన సంచారం లేకుండా రహదారులను దిగ్బంధం చేశారు. తమిళనాడులోని తిరుచిరాపల్లి నుంచి దిల్లీ వెళ్లి అక్కడనుంచి నర్సీపట్నం వచ్చిన ఇద్దరు మహిళలకు కరోనా సోకినట్టు వైద్య పరీక్షల్లో తేలటంతో వారి నివాసం చుట్టుపక్కల అంతా పోలీసులు రెడ్‌జోన్‌గా ప్రకటించారు. పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ పరిధిలోకి తీసుకున్నారు. పట్టణంలోని 22, 23, 24 వార్డులను పూర్తిగా దిగ్బంధం చేశారు.
నర్సీపట్నంలో రెడ్‌జోన్.... ఆంక్షలు కఠినం - నర్సీపట్నం వార్తలు
నర్సీపట్నంలో తొలిసారిగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అప్రమత్తమైన యంత్రాంగం కొన్ని వార్డులను రెడ్జోన్లుగా ప్రకటించింది. ఆ ప్రాంతంలో ఇంటింటి సర్వే చేపట్టాలని నిర్ణయించింది.
రెడ్‌జోన్‌గా ప్రకటించిన ప్రాంతంలో 1481 గృహాలు ఉండగా 5,829 మంది జీవనం సాగిస్తున్నారు. కరోనా కేసులు వెలుగుచూడటంతో ఇంటింటి సర్వేకు 292 బృందాలను నియమించారు. మరోవైపు ఇక్కడి పరిస్థితిని వైద్య శాఖ అధికారులు టెలీకాన్ఫరెన్స్ ద్వారా ఆరోగ్యశాఖ కమిషనర్‌కు వివరిస్తున్నారు. బాధిత మహిళలు దిల్లీ నుంచి వచ్చిన తరువాత ఎవరెవరిని కలిశారని అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి:దేశంలో 5వేలకు చేరువలో కరోనా కేసులు