విశాఖ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా వైరస్‌ను నిర్ధారించే పరీక్షలు నిర్వహించనున్నారు. అవసరమైన ర్యాపిడ్ కిట్లను జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయం నుంచి అన్ని పీహెచ్‌సీలకు చేరవేశారు.వేములపూడి వైద్యాధికారి సుజాత తొలిరోజు 19 మందికి వీటి ద్వారా పరీక్షలు నిర్వహించారు. ప్రాంతీయ ఆసుపత్రిలోనూ ట్రూనాట్ పరికరాల ద్వారా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం వరకు 1116 మందికి పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగిటివ్ రావడం ఊరట కలిగించింది. కరోనా అనుమానిత రోగులకు ర్యాపిడ్ కిట్ల ద్వారా మంగవరం, పాయకరావుపేట, శ్రీరాంపురం పీహెచ్‌సీల పరిధిలో పరీక్షలు ప్రారంభించినట్లు వైద్యులు మధుబాబు తెలిపారు.
ముమ్మరంగా కొవిడ్ నిర్ధారణ పరీక్షలు
కేజీహెచ్ ఆవరణలోని ప్రాంతీయ వైరాలజీ ల్యాబ్‌లో ఆర్టీపీసీఆర్, ట్రూనాట్, సీబీనాట్ ద్వారా కరోనా నిర్ధారణ పరీక్షలు ముమ్మరమయ్యాయి. తక్కువ సమయంలోనే పదివేలకు పైగా పరీక్షలు చేశారు. ఏఎంసీ ప్రిన్సిపాల్ పీవీ సుధాకర్ ఆధ్వర్యంలో వైరాలజీ విభాగ ప్రొఫెసర్లు టెక్నీషియన్లు, ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు పరీక్షలు చేస్తున్నారు. ఈ నెల 6న వైరాలజీ ల్యాబ్, ఈ నెల 11 నుంచి ట్రూనాట్, సీబీనాట్ యంత్రాల ద్వారా పరీక్షలు ప్రారంభించారు. శనివారం వరకు మొత్తం 10,684 నమూనాలను పరీక్షించారు. వీటిలో ఆర్టీపీసీఆర్ ద్వారా 7592, ట్రూనాట్ ద్వారా 3092 పరీక్షలు చేశామని సుధాకర్ చెప్పారు.