BJP state president Purandeshwari harsh comments on YSRCP govt: వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బీజేపీరాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆర్థికసాయం చేస్తున్నా.. కేంద్రం ఏమీ ఇవ్వడం లేదంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం దుష్ప్రచారం చేయటం దుర్మార్గమని పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు కేటాయిస్తుంటే, ఆ నిధులను దారి మళ్లిస్తూ.. జేబులు నింపుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొందని దుయ్యబట్టారు.
తొలిసారిగా విశాఖ విచ్చేసిన పురందేశ్వరి.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకున్న తరువాత.. దగ్గుబాటి పురందేశ్వరి నేడు తొలిసారి విశాఖపట్నం వచ్చారు. దీంతో ఆమెకు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన బీజేపీ నేతలు.. ర్యాలీగా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం.. ప్రజల పట్ల, పెట్టుబడుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై బీజేపీరాష్ట్ర అధ్యక్షురాలు పశ్నల వర్షం కురింపించారు.
జగన్ పాలనలో శాంతిభద్రతలు అత్యంత దారుణం.. దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ..''రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడుల్ని తీసుకురాకపోగా.. వచ్చిన పెట్టుబడిదారుల్ని తరిమేశారు. రాష్ట్రంలో తాము పెట్టుబడులు పెడతామంటూ ముందుకొచ్చిన లులూ గ్రూప్‌ను తరిమేశారు. విశాఖలో అట్టహాసంగా నిర్వహించిన పెట్టుబడుల సదస్సు ఫలితమేంటో ఈ ప్రభుత్వం చెప్పగలదా..? రాష్ట్రంలో శాంతిభద్రతలు అత్యంత దారుణంగా ఉన్నాయి. ఇందుకు నిదర్శనం విశాఖ ఎంపీ కుటుంబ సభ్యులను అరాచక శక్తులు నిర్బంధించడమే'' అని ఆమె అన్నారు.
ఏడు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఏడుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని.. బీజేపీరాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి గుర్తు చేశారు. ఫలితంగా పేదలపై రూ.18093 కోట్ల భారం వేశారని ఆగ్రహించారు. జలశక్తి విషయంలో ఆంధ్రప్రదేశ్ అట్టడుగున ఉందని తాజాగా కేంద్ర మంత్రి స్వయంగా చెప్పారని ఆమె అన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ఉద్యోగుల, కార్మికుల శ్రేయస్సుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుదన్న జగన్.. స్టీల్‌ప్లాంట్‌లో పదవి విరమణ అవుతున్న ఉద్యోగుల స్థానంలో కొత్త నియామకాలు ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. అనంతరం వచ్చే నెల 10వ తేదీన సర్పంచుల నిధుల నిర్లక్ష్యంపై పోరాడనున్నామని పురందేశ్వరి వెల్లడించారు. జాతీయ రహదారుల నిర్మాణాల విషయంలో కేంద్ర ప్రభుత్వం మౌలిక వసతులకు ప్రాధాన్యం ఇస్తుంటే.. ఈ రాష్ట్ర ప్రభుత్వం గుంతల రోడ్లతో ప్రజలను, వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆమె విమర్శించారు.
'కేంద్రం పెద్ద ఎత్తున సాయం చేస్తున్నా.. జగన్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోంది' సీఎం జగన్‌కు పరిశ్రమల అభివృద్ధి మీద దృష్టి లేదు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మీద ధ్యాసలేదు. జంజావతి, తోటపల్లి రిజర్వాయర్‌ల పనులను గాలికి వదిలేశారు. సిలికా, ల్యాట్‌రైట్, మాంగనీస్, బాక్సైట్ వంటి వాటిని తవ్వేసుకుంటూ.. వారి జేబులు నింపుకుంటున్నారు. ఇంతవరకూ చేసిన అప్పులు చాలవంటూ మరికొన్ని అప్పులు తీసుకోవడానికి ఈ జగన్ ప్రభుత్వం సిద్ధమైంది. జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న అనధికార అప్పుల మీద కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు ఫిర్యాదు చేశాను. -పురందేశ్వరి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు