రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో నేటి నుంచి విశాఖ జిల్లా వ్యాప్తంగా కర్ఫ్యూ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి పాక్షిక కర్ఫ్యూ అమలులోకి రాగా... వ్యాపార సముదాయాలు, దుకాణాలు మూసివేశారు. ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. అనేక చోట్ల పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిబంధనల అమలుకు కృషి చేస్తున్నారు. కరోనా కట్టడికి సహకరించి ప్రజలు ఇళ్ల వద్దే ఉండాలని వారు సూచిస్తున్నారు.
తొలి రోజు రహదారులపైకి వచ్చినవారికి పోలీసులు అవగాహన కల్పించారు. జిల్లాలోని అనకాపల్లి, జి.మాడుగల, విశాఖ మన్యం, ఎలమంచిలి నియోజకవర్గల్లో పోలీసులు ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. మన్యంలో నిత్యావసరాలు, మందుషాపుల ముందు బారులు తీరిన వారిని పోలీసులు ఇళ్లకు పంపించివేశారు. సైరన్ మోగిస్తూ గస్తీ నిర్వహించారు. అనేక చోట్ల మైక్‌లలో కరోనా పరిస్థితులపై ప్రచారం చేసి ప్రజలకు అవగాహన కల్పించారు.