మావోయిస్టులకు వ్యతిరేకంగా రహదారులపై కరపత్రాలు దర్శనమిచ్చాయి. మావోయిస్టులారా మీ రక్త దాహానికి ఇంకెంత మంది బలి కావాలంటూ.. ఇటీవల ఇన్ఫార్మర్ నెపంతో హత్యకు గురైన గెమ్మెలి కృష్ణారావు, అతని మిత్రుల పేరు మీద ఈ కరపత్రాలు ప్రచురితమయ్యాయి. విశాఖ ఏజెన్సీ జి.మాడుగుల మండలం మద్ది గరువు, వాకపల్లి, సూరిమెట్ట, మండిబ, సుబ్బులు, పులుసు మామిడి, నుర్మతి గ్రామాల రహదారులపై మావోయిస్టులకు వ్యతిరేకంగా కరపత్రాలు పడి ఉన్నాయి.. మావోయిస్టులను తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నట్లుగా ముద్రించబడ్డాయి. వీటిలో కొన్ని ముఖ్య అంశాలతో మావోల చర్యలపై ప్రశ్నలు సంధించారు.
అమాయకులను బలిచేస్తున్నారు?
గెమ్మెలి కృష్ణారావు హత్యకు రామ్ గూడా ఎన్కౌంటర్ కారణమా? ఎక్కడ రామ్ గూడా? ఎక్కడ వాకపల్లి? ఎప్పుడో 2016 లో జరిగిన ఎన్ కౌంటర్ గురించి.. ఎవడో బొల్లి అనేవాడు చెబితే, ఇప్పుడు 2020 లో మా గ్రామస్థులను చంపుతారా?... గడిచిన నాలుగేళ్ల కాలంలో 25 మంది అమాయకులను ఇలాగే ఎన్కౌంటర్లకు కారణమంటూ నింధించి చంపేశారు.. ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత మా ఊరి వ్యక్తిని అదేకారణంతో హతమార్చారు? అసలు ఇది నమ్మేలా ఉందా! సరైన కారణాలు దొరకక ఇప్పుడు రామ్ గూడ ఖాతాలో వేశారా? అంటూ మావోలను గ్రామస్థులు కరపత్రంలో ప్రశ్నించారు.
మీ చర్యలకు మృతుని కుటుంబం ఏం కావాలి?
ఇన్ఫార్మర్ల నెపంతో మీరు చంపిన వ్యక్తి భార్య, నలుగురు పిల్లల పరిస్థితి ఏమిటి? అంటూ కరపత్రాల్లో ప్రశ్నించారు. మీ వల్ల రోడ్లు లేవు, ఫోన్లు లేవు, ఆసుపత్రులు లేవు, ఉద్యోగాలు లేవు, పనులు లేవు.. జీవనాధారం కోసం కృష్ణారావు అనే గ్రామస్తుడు వీఎస్ఎస్ లో పని చేసుకుంటుంటే తప్పని చంపేశారు. భవిష్యత్తులో అతని భార్య నలుగురు పిల్లల్ని ఏమి పెట్టి పోషించాలి? మృతుని భార్య అడుగుతున్న ప్రశ్నకు మీ పార్టీలో ఎవరు సమాధానం చెబుతారు? ఏమని సమాధానం చెబుతారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.