Organ Donation in Visakhapatnam: చనిపోతూ.. బతుకుతున్నారు. పుడమి తల్లి ఒడిలోకి చేరకముందే.. మరో ప్రాణాన్ని కాపాడుతున్నారు. ఓ తల్లికి బిడ్డగా మరణించినా.. ఎందరో మాతృమూర్తులకు కడుపుకోతను దూరం చేస్తున్నారు. అవయవదానంతో మరొకరికి పునర్జన్మనివ్వడమే కాకుండా.. వారూ పునర్జన్మను ఎత్తుతున్నారు. గుండె, కిడ్నీ, లివర్, కళ్లు.. ఇలా ముఖ్యమైన అవయవాలను దానం చేస్తూ.. చాలా మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. చనిపోయి కూడా నలుగురిని బతికిస్తున్నారు. మరణ అంచుల్లో ఉన్నప్పటికీ మరికొందరు.. ఇతరుల గురించి ఆలోచించి.. పునర్జన్మను ప్రసాదిస్తున్నారు. వారి కుటుంబాల్లో విషాదం నిండినా.. అవయవ దానంతో ఇతరులు కుటుంబాల్లో చిరునవ్వులు చిందిస్తూ.. జీవన్మృతులుగా మిగిలిపోతున్నారు. ఇలాంటి వారు ఎందరో ఉన్నారు. తాజాగా ఈ జాబితాలోకి విశాఖకు చెందిన మరో యువకుడు చేరాడు.
Organ Donation in VIMS: జీవన్మృతుడిగా యువకుడు.. చనిపోతూ మరో ఐదుగురికి వెలుగులు - vizag institute of medical science
Organ Donation in Visakhapatnam అవయవదానం ఓ వరం. చనిపోతూ మరో నలుగురిని బతికించడం గొప్ప విషయం. అవయవదానానికి ముందుకు వచ్చి ఇతరుల కుటుంబాల్లో సంతోషాన్ని నింపుతున్నారు. తాజాగా ఓ యువకుడు తాను చనిపోతూ.. మరో ఐదుగురికి వెలుగులు నింపి జీవన్మృతుడిగా మిగిలాడు.
ప్రమాదంలో మరణించి మరో ఐదుగురు జీవితాల్లో కొత్త వెలుగులు నింపాడు ఓ యువకుడు. ఈ బృహత్తర కార్యక్రమానికి విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వేదిక అయ్యింది. కేవలం మూడు వారాల వ్యవధిలోనే బ్రెయిన్ డెడ్ అయిన మరో వ్యక్తి నుంచి అవయవాలు సేకరించి అరుదైన రికార్డును విమ్స్ ఆస్పత్రి సొంతం చేసుకోంది. విశాఖ ఆరిలోవ కాలనీకి చెందిన వెంకట సంతోష్ కుమార్ (32) ఏసీ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. ఈ నెల 20వ తేదీన కొమ్మాదిలో ఏసీ రిపేరు చేస్తుండగా ప్రమాదవశాత్తు రెండవ అంతస్తు పైనుంచి కిందకి పడిపోయాడు. తలకు తీవ్రంగా దెబ్బ తగలడంతో నగరంలోని ఒక కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు.
ఐదుగురికి అవయవ దానం: బ్రెయిన్లో విపరీతమైన రక్తస్రావం జరగటం వలన బ్రెయిన్ డెడ్‌గా ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. ఈ క్రమంలోనే కుమారుడుకి అలా జరిగిన బాధలో ఉన్న కుటుంబ సభ్యులు.. మరొక కుటుంబంలో కొత్త వెలుగులు నింపాలని నిర్ణయించుకున్నారు. మూడు వారాల కిందట విమ్స్ ఆస్పత్రిలో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి అవయవాలు సేకరించారని తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంతోష్ కుమార్‌ను విమ్స్ ఆస్పత్రికి తరలించారు. విమ్స్ ఆస్పత్రి వైద్యులు.. సంతోష్ కుమార్ నుంచి రెండు కిడ్నీలు, లివర్, రెండు కళ్లు సేకరించారు. వాటిని జీవన్ దాన్ ప్రోటోకాల్ ప్రకారం ఐదుగురు వ్యక్తులకు కేటాయించారు. తాను మరణించి మరో ఐదుగురు జీవితాల్లో కొత్త వెలుగులు నింపిన సంతోష్ కుమార్‌కు విమ్స్ డైరెక్టర్ కె.రాంబాబు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. విమ్స్ ఆస్పత్రి సిబ్బంది సంతోష్ కుమార్ మృతదేహానికి పుష్పాలు జల్లుతూ 'సంతోష్ కుమార్ అమర్ రహే' అంటూ ఘన వీడ్కోలు పలికారు.