విశాఖలోని రైతు బజార్లకు కూరగాయల దిగుమతి బాగా తగ్గిపోయింది. సీతమ్మధార, ఎంవీపీ కాలనీ, కంచరపాలెం, గోపాలపట్నం, పెద్ద వాల్తేరు రైతుబజార్లలో.. సమీప పల్లెల నుంచి రైతులు తాము పండించిన కూరలు తెచ్చి అమ్ముతుంటారు. ఈ సీజన్ లో ఏటా విపరీతంగా కూరగాయలు దిగుమతి అవుతుండేవి. ధరలు సామాన్యంగానే ఉండేవి. ఈ ఏడాది సరైన వర్షాలు లేక.. పరిస్థితి తారుమారైంది. కూరగాయల ఉత్పత్తి తగ్గిన ఫలితంగా.. ధరలు విపరీతంగా పెరిగాయి. ఫలితంగా.. విశాఖ వాసులు ఒకటికి రెండు సార్లు ఆలోచించి కూరగాయలు కొనుగోలు చేయాల్సివస్తోంది.
దిగుమతి తగ్గింది.. ధర పెరిగింది! - వర్షాలు లేవు
రుతుపవనాలు ఈసారి ఆలస్యంగా వచ్చిన ఫలితంగా... వర్షాలు అంతంత మాత్రంగా కురుస్తున్నాయి. కూరగాయల దిగుమతి లేక విశాఖ రైతు బజార్లు వెలవెలబోతున్నాయి. వచ్చిన కొద్దిపాటి కూరగాయలకు వ్యాపారులు చెబుతున్న ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి.
రైతుబజార్లకు పల్లెలు నుంచి ప్రధానంగా బెండ, దొండ, వంకాయ, బీరకాయ, ఆకుకూరలు వస్తాయి. వీటి దిగుబడి ఈ ఏడాది దారుణంగా తగ్గింది. వర్షాలు లేని పరిస్థితి రైతులకు శాపంగా మారింది. ఆశించిన వర్షాలు పడితే స్థానిక కూరలు వచ్చి అందుబాటులో ధరలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. మరోవైపు.. ఇతర ప్రాంతాల నుంచి ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, బీట్ రూట్, క్యారెట్ వంటి రకాలు దిగుమతి చేసుకుంటున్నారు. వీటి ధరలూ అధికంగానే ఉంటున్నాయి. ప్రభుత్వం సత్వరమే స్పందించి.. సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.