ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్థానిక సంగ్రామం: కొనసాగుతున్న నామినేషన్ల పర్వం - ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వార్తలు

విశాఖ జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల పర్వం ఇవాళ్టితో ముగియనుంది. ప్రధాన పార్టీలైనా వైకాపా, తెదేపా తరపున నామినేషన్లు దాఖలు చేస్తుండగా...ఇవాళ మరిన్ని నామినేషన్లు దాఖలుకానున్నాయి.

nominations procesess ongoing  in vishaka district
nominations procesess ongoing in vishaka district

By

Published : Mar 11, 2020, 11:19 AM IST

స్థానిక సంగ్రామం: కొనసాగుతున్న నామినేషన్ల పర్వం

జిల్లా, మండల ప్రాదేశిక నియోజక వర్గాల్లో నామినేషన్ల స్వీకరణ నేటితో ముగియనుంది. జడ్పీటీసీ స్థానాలకు మంగళవారం 12 మండలాల నుంచి 15 మంది అభ్యర్థులు 16 సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. కొయ్యూరు మండలం నుంచి ఇద్దరు, పాయకరావుపేట, పెదబయలు నుంచి ఇద్దరు చొప్పున దాఖలు చేశారు. సోమవారం నాడు ముగ్గురు అభ్యర్థులు దాఖలు చేశారు. మొత్తం 39 జడ్పీటీసీ స్థానాలకు రెండు రోజుల్లో 19 నామినేషన్లు దాఖలయ్యాయి. 651 ఎంపీటీసీ స్థానాలకు 197 మంది నామినేషన్లు వేశారు. వీటిలో రెండు మూడు సెట్లు వేసినవారూ ఉన్నారు.

ఇక బుధవారంతో గడువు ముగియనుండటంతో నామినేషన్లు వెల్లువెత్తనున్నాయి. అధికార వైకాపా, తెదేపా, కాంగ్రెస్‌, భాజపా, జనసేన, సీపీఐ, సీపీఎం, ఇతర పార్టీల నుంచి అభ్యర్థులు రంగంలో దిగనున్నారు. ఒక్కో స్థానానికి కనీసం నాలుగు నుంచి ఏడు నామినేషన్లు రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఎంపీటీసీ స్థానాలకు వేల సంఖ్యలో ఒకేరోజున నామినేషన్లు వచ్చే అవకాశం ఉండడంతో మండల కేంద్రాల్లో అదనపు ఏర్పాట్లు చేస్తున్నారు. జడ్పీ కార్యాలయంలో ప్రతి రెండు మండలాలకు అదనపు కౌంటరు, ఉన్నవారికి తోడుగా మరో 100 మంది పోలీసు సిబ్బందిని నియమించినట్లు జడ్పీ సీఈఓ నాగార్జునసాగర్‌ వెల్లడించారు.

రెండు రోజుల్లో ఒక్క నామినేషన్ లేదు..

ఎలమంచిలి మండల పరిషత్ ఎన్నికలు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ప్రారంభించి రెండు రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఏ ఒక్కరూ నామినేషన్ దాఖలు చేయలేదు. జిల్లాలో అతి చిన్నదిగా యలమంచిలి మండలం గుర్తింపు పొందింది. ఇక్కడ కేవలం ఏడు ఎంపీటీసీ స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి. సోమ, మంగళవారాల్లో నామినేషన్లు రాకపోవడంతో ఇవాళ నమోదు కావొచ్చని అధికారులు చెబుతున్నారు.

జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో గెలుపు గుర్రాల కోసం ప్రధాన పార్టీలు అన్వేషిస్తున్నారు. మరోవైపు ఆశావహులతో పార్టీ ఆఫీసులు కోలాహలంగా మారుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details