MP GVL On Modi Visakha tour: ప్రధాని పర్యటనలో రైల్వే జోన్ అంశం చేర్చలేదని, నిర్దేశించిన తొమ్మిది కేంద్ర ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు మాత్రమే ఉంటాయని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ అంశం లాంటివి షెడ్యూల్లో లేవనన్నారు. ఈనెల 11వ తేదీ రాత్రి విశాఖ చేరుకోగానే ఒకటిన్నర కిలోమీటర్ల పొడవునా కంచరపాలెం నుంచి మెట్టు వరకు ప్రధానమంత్రి రోడ్ షోను భాజపా నిర్వహిస్తుందన్నారు.
12వ తేదీ ఉదయం ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటయ్యే బహిరంగ సభాస్ధలి వద్ద కార్యక్రమాలను వివరించారు. ప్రధాని మోదీ.. నాలుగు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, ఐదు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారన్నారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ, రాయ్పూర్-విశాఖ ఎకనామిక్ కారిడార్, విశాఖ రైల్వే స్టేషన్ ఆధునీకరణ, విశాఖలో కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలానగర్ వరకూ నేరుగా పోర్టు రహదారి, గెయిల్ ద్వారా శ్రీకాకుళం నుంచి ఒడిశాలోని అంగుల్ వరకూ గెయిల్ పైప్లైన్ నిర్మాణం, గుంతకల్లులో ఐవోసీఎల్ చేపడుతున్న ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారని జీవీఎల్ స్పష్టం చేశారు.