విశాఖ నగరాభివృద్ధిపై మంత్రులు కన్నబాబు, అవంతి, ఎంపీ విజయసాయిరెడ్డి.. అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. టౌన్ ప్లానింగ్, వీఎంఆర్‌డీఏ, కరోనా మూడో దశపై ప్రధానంగా చర్చించారు. గడువులోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. నిబంధనల పేరుతో పేదల ఇళ్లు కూల్చొద్దని జీవీఎంసీకి ఆదేశాలు జారీ చేశారు.
వీఎంఆర్‌డీఏ బృహత్ ప్రణాళికపై 16 వేల ఫిర్యాదులు వచ్చాయని మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. బృహత్ ప్రణాళిక తయారీలో క్షేత్రస్థాయి సమస్యలు పరిగణించలేదన్నారు. అభ్యంతరాలు పరిష్కారమయ్యే వరకు మాస్టర్‌ప్లాన్‌పై ముందుకెళ్లవద్దని సూచించారు. 2041 వరకు ఉండే మాస్టర్‌ప్లాన్‌తో ఎవరికీ నష్టం జరగకూడదన్నారు. పేదల ఇళ్ల పట్ల జీవీఎంసీ దూకుడుపై ఫిర్యాదులు వస్తున్నాయని..,టౌన్‌ప్లానింగ్ విభాగం దూకుడు వల్ల సమస్యలు ఎదురవుతున్నాయని వ్యాఖ్యనించారు. వంద గజాల్లోపు ఇళ్లపై దూకుడు వద్దని జీవీఎంసీని ఆదేశించారు. ఇళ్లు కూల్చితే సహేతుకమైన కారణం తప్పకుండా ఉండాలన్నారు.