Minister Amarnath : సీఎం జగన్ మోహన్ రెడ్డి కొద్దిరోజుల్లో విశాఖ వచ్చి.. ఇక్కడే ఉండి పరిపాలన చేస్తారని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాజధాని కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని మంత్రి వెల్లడించారు. అందరూ అనుకున్న సమయానికంటే ముందే సీఎం విశాఖ వస్తారని చెప్పారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖ కేఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో మీడియాతో మాట్లాడారు. జీఐఎస్ సదస్సు 2023 విజయవంతమైందని.. రూ.13.6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. 376 ఎంవోయూలు జరిగాయని దాదాపు 6 లక్షల ఉద్యోగాలు వస్తాయని వివరించారు.
ప్రత్యేక కమిటీ పర్యవేక్షణలో... ఎంవోయూల మీద రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఒక కమిటీ పర్యవేక్షణ చేస్తుందని వెల్లడించారు. ఇప్పటికే వివిధ పరిశ్రమలకు సంబధించి 96 అనుమతులు పూర్తి చేసి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మొదటి స్థానంలో ఉన్నామని స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నారు. పారిశ్రామిక వేత్తలు కోరుతున్నట్లుగా.. వారికి కావలసిన మానవ వనరులు రాష్ట్రంలో పుష్కలంగా ఉన్నాయని.. రొయ్యలు, కోకో, మ్యాంగో పల్ప్ ఏపీ నుంచి ఎగుమతి అవుతున్నాయని చెప్పారు. విశాఖ తిరుపతి శ్రీ సిటీ కోపర్తిలో ఐటీ అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఆరు నెలల్లో ఏయే కంపెనీలు గ్రౌండ్ రియాలిటీ చేస్తారో వారికి ప్రభుత్వం తరఫున మంచి సహకారం ఉంటుందని చెప్పారు.