ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భారీ పెట్టుబడులతో పారిశ్రామిక దిగ్గజాలు రాష్ట్రానికి రాబోతున్నారు: మంత్రి అమర్నాథ్​ - Global Investment Summit at AU

Global Investment Summit: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వెస్ట్​మెంట్​ సదస్సుకు పలువురు పారిశ్రామిక దిగ్గజాలు పెద్ద ఎత్తున పెట్టుబడులతో రాష్ట్రానికి రాబోతున్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. వచ్చేనెల స్థానిక ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్​లో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్ట్​మెంట్​ సమ్మిట్ ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు.

Global Investment Summit
Global Investment Summit

By

Published : Feb 21, 2023, 10:38 PM IST

Global Investment Summit: రాష్ట్రంలో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకొని, పెద్దఎత్తున పారిశ్రామిక పెట్టుబడులను రాబట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వెస్ట్​మెంట్​ సదస్సుకు పలువురు పారిశ్రామిక దిగ్గజాలు పెద్ద ఎత్తున పెట్టుబడులతో రాష్ట్రానికి రాబోతున్నారని ఆయన అన్నారు. వచ్చేనెల మూడు, నాలుగువ తేదీలలో స్థానిక ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్​లో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్ట్​మెంట్​ సమ్మిట్ ఏర్పాట్లను మంత్రి అమర్నాథ్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్లోబల్ ఇన్వెస్ట్​మెంట్​ సదస్సుకు రాష్ట్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న దేశాలు, రాష్ట్రాల నుంచి పెట్టుబడిదారులను, పారిశ్రామిక దిగ్గజాలను ఆహ్వానించేందుకు పలు ప్రాంతాలలో రోడ్ షోలు నిర్వహించామని అన్నారు. సుమారు 40 నుంచి 45 దేశాలకు చెందిన ప్రతినిధులను విశాఖ గ్లోబల్ ఇన్వెస్ట్​మెంట్​ సమ్మిట్​కు ఆహ్వానించామని మంత్రి తెలియజేశారు. కొవిడ్ కారణంగా గత రెండు సంవత్సరాలుగా ఇటువంటి సదస్సులు నిర్వహించలేకపోయామని.. అయితే ఈ సదస్సు రాష్ట్ర ముఖచిత్రాన్ని మారుస్తుందని మంత్రి అమర్నాథ్ చెప్పారు.

ఎవరెవరు వస్తున్నారంటే: సదస్సుకు 14 రంగాలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నామని వీటిలో ఏరో స్పేస్ అండ్ డిఫెన్స్, ఎగ్రి అండ్ ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ, రెన్యువబుల్ ఎనర్జీ, పెట్రోలియం మరియు పెట్రో కెమికల్స్, హెల్త్ కేర్ అండ్ మెడికల్ ఎక్విప్​మెంట్​, ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్స్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్, స్టార్టప్స్ అండ్ ఇన్నోవేషన్, టెక్స్​టైల్స్ అండ్ అపరల్స్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ, ఫార్మాస్యూటికల్ అండ్ లైఫ్ సైన్సెస్, మొదలగు రంగాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఆయా శాఖలకు చెందిన కేంద్ర మంత్రులను కూడా సదస్సు ఆహ్వానించామని మంత్రి చెప్పారు. పలువురు పారిశ్రామికవేత్తలను కలిసినప్పుడు అంబానీ వంటి ప్రముఖులు విశాఖ నగరంపై ప్రశంసలు జల్లు కురిపించారని అమర్నాథ్ చెప్పారు. గ్లోబల్ ఇన్వెస్ట్​మెంట్​ సదస్సుకు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా వంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు హాజరు కాబోతున్నారని తెలిపారు. ఈ సమ్మిట్​లో సుమారు 20 దేశాలు ఆంధ్రప్రదేశ్​తో వాణిజ్య సంబంధాలు ఏర్పరచుకునేందుకు సిద్ధంగా ఉన్నాయని మంత్రి అమర్నాథ్ తెలియజేశారు.

పరిశ్రమలను నెలకొల్పేందుకు చర్యలు:విశాఖ నగరంతోపాటు తిరుపతి, అనంతపురంలో ఐటి పరిశ్రమలను పెద్ద ఎత్తున నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అలాగే భోగాపురంలో 100 ఎకరాల్లో ఐటీ పార్కులు ఏర్పాటు చేయబోతున్నామని.. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో 15 వేల కోట్ల రూపాయలతో పోర్టులను అభివృద్ధి చేస్తున్నామని, ఇందులో భాగంగా ఈ ఏడాది డిసెంబర్ చివరినాటికి రామాయపట్నం పోర్టుకు మొదటి వెసెల్ రానున్నదని తెలియజేశారు. కాగా 2021-22 ఆర్థిక సంవత్సరంలో 1,50,000 కోట్ల రూపాయల ఎగుమతులు చేసి దేశంలో మన రాష్ట్రం నాలుగో స్థానంలో నిలిచిందని ఆయన తెలియజేశారు.

ముఖ్యమంత్రి ఆదేశాలు: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే పారిశ్రామికవేత్తలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని భూమి, నీరు, విద్యుత్తు సక్రమంగా అందించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని అమర్నాథ్ చెప్పారు. ఈ గ్లోబల్ ఇన్వెస్ట్​మెంట్​ సదస్సు రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురావడమే కాకుండా, లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయని మంత్రి చెప్పారు. ఈ సమ్మిట్​లో పాల్గొనేందుకు ఇప్పటికే 4,800 మంది రిజిస్టర్ చేసుకున్నారని మంత్రి అమర్నాథ్ తెలియజేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details