విశాఖ మన్యం అనగానే అందరికీ గుర్తొచ్చేది అక్కడి ప్రకృతి రమణీయత. ఊటీలోని అందాలను... కొడైకెనాల్లోని సోయగాలను మేళవం చేసినట్టుండే ఆహ్లాదం అరకు సొంతం. అటువంటి కమనీయత మాటున 'నిగూఢ సాగు' జరుగుతోంది. కొండకోనల్లో నివసించే అమాయకపు ఆదివాసీల జీవన విధానం రోజురోజుకూ కలుషితమవుతోంది. పచ్చని చెట్ల చాటున గంజాయి ఏపుగా పెరుగుతోంది.
మన్యం టూ మహానగరం...
విశాఖ మన్యంలో పండించిన గంజాయి దేశ నలుమూలలకూ చేరుతోంది. మహారాష్ట్ర నుంచి మొదలుకొని నాగపూర్, హైదరాబాద్, విజయవాడ, చెన్నై తదితర నగరాలకు రవాణా జరుగుతోంది. ఒకప్పుడు నామమాత్రంగా ఉన్న గంజాయి సాగు... మాఫియా రంగ ప్రవేశంతో మహావృక్షంలా తయారైంది. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడుకు చెందిన ముఠాల రాకతో సాగు వేల ఎకరాలకు చేరింది.
12 వేల ఎకరాల్లో...
ఆంధ్రప్రదేశ్లో మొత్తం 15 వేల ఎకరాల్లో గంజాయి సాగవుతోంది. ఒక్క విశాఖలోనే 12 వేల ఎకరాల్లో ఈ పంట పండుతోంది. తూర్పు గోదావరి జిల్లాలో 2250 ఎకరాలు, మిగతా జిల్లాల్లో 750 ఎకరాల్లో ఈ సాగు జరుగుతోందని ఎక్సైజ్ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. మన్యంలో ప్రతిఏటా 3 లక్షల టన్నుల గంజాయి దిగుబడి వస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని 11 మండలాల్లో 159 గ్రామాల్లో ప్రధానంగా గంజాయి సాగవుతోంది.