విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన సర్వీసుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్ధితి ఏర్పడుతోంది. ఒకప్పుడు రోజూ 105 విమానాలు నడిచే పరిస్ధితి నుంచి.. ఇప్పుడు 67 సర్వీసులకు పరిమితమైంది. గతంలో ఐదు దేశాలకు నేరుగా విమాన సర్వీసులు ఉంటే, ఇప్పుడు అవి నాలుగు దేశాలకే పరిమితమయ్యాయి. విశాఖ నుంచి హైదరాబాద్, బెంగళూరు, దిల్లీ, కోల్కతా వంటి ప్రధాన నగరాలకు.. తొలి నుంచి సర్వీసులు నడుస్తూనే ఉన్నాయి.
రాష్ట్ర రాజధాని విజయవాడకు ఎయిర్‌ఇండియా సర్వీసు ఆరంభించిన దగ్గర నుంచి.. 80 శాతం ఆక్యుపెన్సీతో నడిచేది. అటువంటి సర్వీసునూ ఎయిర్‌ఇండియా తాజాగా నిలిపివేసింది. అలాగే నెల రోజుల క్రితం ఆర్ధిక రాజధాని ముంబయికి ప్రారంభించిన సర్వీసుకు ఆదరణ ఉన్నప్పటికి, ఇప్పుడు దానిని కూడా నిలిపివేసింది. ఎయిర్‌ఇండియా సంస్థ ఆర్ధిక కష్టాల్లో ఉండడమే దీనికి కారణమని తెలుస్తోంది.
ఇప్పుడు ఈ... రెండు నగరాలకు విశాఖ నుంచి నేరుగా విమాన సర్వీసులు అందుబాటులో లేవు. అంతర్జాతీయ సర్వీసులను పరిశీలిస్తే శ్రీలంక ఎయిర్‌లైన్స్ తన సర్వీసులను నిలిపివేసి దాదాపు ఆరు నెలలు అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం కొంత సాయం అందిస్తే, తాము సర్వీసు నడుపుతామని అప్పట్లో ఆ సంస్థ ప్రతిపాదించినా..... ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో సర్వీసు నిలిచిపోయింది..