Gas leakage in LG Polymers incident: సరిగ్గా మూడేళ్ల క్రితం..! ఇదే రోజు తెల్లవారుజామున విశాఖ నగరంలోని ఓ ప్రాంతాన్ని విషవాయువు కమ్మేసింది. 2020 మే 7న విశాఖలో కనీవిని ఎరుగని విషాదం చోటుచేసుకుంది. RR వెంకటాపురంలోని LG పాలిమర్స్ పరిశ్రమ నుంచి స్టైరీన్ అనే విషవాయువు లీకై.. అల్లకల్లోలం జరిగింది. నిద్రిస్తున్నవారు నిద్రలోనే మృత్యువు ఒడిలోకి చేరుకున్నారు. ఇలా 12 మంది ప్రాణాలొదిలారు. ప్రాణాలు దక్కించుకునేందుకు వందలాది మంది చీకట్లోనే పరిగెత్తుతూ తొక్కిసలాటలో నరకం అనుభవించారు. వాంతులు చేసుకుంటూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. పరిశ్రమకు ఆనుకుని ఉన్న వెంకటాపురం గ్రామస్థులు నేటికీ తీవ్ర సమస్యలతో సతమతమవుతున్నారు.
గాల్లో కలిసిన జగన్ హామీలు.. మీ బిడ్డే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని ఉన్నాడు.. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన బాధితులకు అండగా ఉంటాడంటూ.. ముఖ్యమంత్రి జగన్.. ఆనాడు ఇచ్చిన హామీలు ఇవి. కానీ క్షేత్రస్థాయి పరిస్థితి ఇప్పటికీ దారుణంగానే ఉంది. ఈ బాధిత మహిళ ఒక్కరి బాధ వింటే చాలు.. ముఖ్యమంత్రి హామీలు ఏ మేరకు అమలయ్యాయో.. ఇట్టే అర్థమైపోతుంది. ఎల్జీ పాలిమర్స్ విషవాయువు ఘటన జరిగి మూడేళ్లు పూర్తయినా.. అది ఇప్పటికీ వారిని కోలుకునీయకుండా కుంగదీస్తూనే ఉంది. దుర్ఘటన జరిగినప్పుడు ఆ వారం రోజుల హడావుడి తప్ప.. ఆ తర్వాత బాధితులను పట్టించుకున్న పాపానపోలేదు. ప్రకటించిన పరిహారాలు పూర్తిస్థాయిలో అందలేదు. బాధితుల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తామన్న హామీలు గాల్లో కలిశాయి. రోజురోజుకూ క్షీణిస్తున్న ఆరోగ్యంతో.. బాధితులు.. ఆర్థికంగా, మానసికంగా కుంగిపోతున్నారు. సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రికి నిర్మాణానికి నాటి మంత్రి అవంతి శ్రీనివాసరావు చేసిన శంకుస్థాపన శిలాఫలకం సైతం మాయమైంది.
గ్రామంలో రక్షిత మంచి నీరు ఊసేలేదు. పోలీసులు కేసులతో యువత జీవితాలు అంధకారమయ్యాయి. మూడేళ్లలో ఎల్జీ పాలిమర్స్ బాధితులకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా నిలవలేకపోయింది.. 2 లేదా 3 రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్న.. ప్రాథమిక చికిత్స పొందినవారిలో కొందరికే పరిహారం అందించారు. దుర్ఘటన జరిగిన తర్వాత.. 15 నుంచి నెల రోజుల వ్యవధిలో మరో ముగ్గురు మృతిచెందారు. వారు విషవాయువు ప్రభావంతోనే మరణించారని కుటుంబసభ్యులు చెబుతున్నారు. కేవలం లక్ష రూపాయల పరిహారమిచ్చి చేతులు దులుపుకున్నారని వారు వాపోతున్నారు. మృతుల కుటుంబాల్లో ఒకరికి ఉపాధి కల్పిస్తామన్న హామీ కూడా నెరవేర్చలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.