Kidney Racket Updates : విశాఖపట్నంలో కిడ్నీరాకెట్ వ్యవహారంపై బాధితుడు వినయ్‌కుమార్ ఫిర్యాదు మేరకు తీగలాగితే డొంక కదులుతోంది. విశాఖలో కిడ్నీ రాకెట్ ముఠా వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. డీసీపీ ఆనంద్ రెడ్డి నేతృత్వంలో సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్న.. ముఠా సభ్యులు కనకరాజు, శ్రీను, ఇలియానాను ప్రశ్నిస్తున్నారు. వారి నుంచి వివరాలు రాబడుతున్నారు. కిడ్నీ మార్పిడి వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన తిరుమల ఆసుపత్రి యజమాని డాక్టర్ పరమేశ్వరావును అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడ్ని ప్రశ్నిస్తున్నారు. ఆసుపత్రిని సీజ్ చేసి తనిఖీలు చేపట్టారు. మరోవైపు.. అనుమతి లేకుండా చికిత్స చేసిన శ్రీకాంత్ కోసం.. ప్రత్యేక బృందాలు గాలింపు ముమ్మరం చేశారు. కాకినాడలో ఉన్నారన్న సమాచారంతో ప్రత్యేక బృందాలు అక్కడికి వెళ్లి గాలిస్తున్నాయి.
ఇంటికి తీసుకువెళ్లిన బంధువులు:విశాఖ కేజీహెచ్ నుంచి బాధితుడు వినయ్‌కుమార్‌ను అతని బంధువులు ఇంటికి తీసుకెళ్లారు. కిడ్నీ రాకెట్ బాధితుడు వినయ్‌ను నిన్న పోలీసులు ఆస్పత్రిలో చేర్చారు. వైద్యం సరిగా అందట్లేదని వినయ్‌కుమార్ బంధువులు ఆరోపిస్తున్నారు. పరీక్షల పేరుతో రకారకాలు టెస్టులు చేస్తున్నారని అతని బంధువులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వైద్యులతో వాదించి ఆస్పత్రి నుంచి వినయ్‌ను అతని బంధువులు తీసుకెళ్లారు.
యూరాలజీ విభాగం: పోలీసుల సూచన మేరకు కుటుంబసభ్యులు వినయ్‌కుమార్‌ను నిన్న యూరాలజీ విభాగంలో చేర్చారు. వైద్యులు అతని కిడ్నీ తీశారా లేదా అనే నిర్ధరణ కోసం యూరాలజీ విభాగాంలో చేర్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో కేజీహెచ్ వైద్యులు వినయ్‌కుమార్‌కు కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే, ఫలితాలు రాకముందే వినయ్‌కుమార్‌ను అతని బంధువులు ఆసుపత్రి నుంచి తీసుకెళ్లారు.