PM MODI ROAD SHOW AT MARUTHI JUNCTION : రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ విశాఖకు చేరుకున్నారు. ఆయనకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ స్వాగతం పలికారు. మధురైలో వర్షం కారణంగా విశాఖకు ఆరగంట ఆలస్యంగా చేరుకున్నారు. భాజపా పార్టీ ఏర్పాటు చేసిన రోడ్‌షోలో మోదీ పాల్గొన్నారు. మారుతి కూడలి నుంచి 1.5 కిలోమీటర్ల మేర రోడ్‌షో కొనసాగింది. రోడ్‌షోలో భారీ ఎత్తున భాజపా కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. మోదీ ప్రజలకు అభివాదం చేశారు. ప్రధాని రోడ్ షో మార్గంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
పోలీసుల దిగ్బంధంలో విశాఖ: ప్రధాని నరేంద్ర మోదీ రాక దృష్ట్యా విశాఖ నగరాన్ని పోలీసు దిగ్బంధం చేశారు. ప్రధాని, గవర్నర్, సీఎం పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విశాఖ విమానాశ్రయం వద్ద జరిగిన గత పరిణామాల దృష్ట్యా విమానాశ్రయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి విమానాశ్రయంలోకి అనుమతిస్తున్నారు. మీడియాకు సైతం విమానాశ్రయ ప్రాంగణంలోకి అనుమతి నిరాకరించారు. అయితే భద్రత దృష్ట్యా పోలీసుల తనిఖీలతో విమాన ప్రయాణికులకు ఇబ్బందులకు గురవుతున్నారు.
ఏయూ వద్ద హెలీప్యాడ్ల ట్రైల్స్: విశాఖలో ప్రధాని రాక సందర్భంగా ఏయూ ప్రాంగణంలో నౌకాదళ అధికారులు, సిబ్బంది 3 హెలీప్యాడ్లు ఏర్పాటు చేశారు. రేపు ప్రధాని ప్రసంగించనున్న బహిరంగ సభకు చేరువలో హెలీప్యాడ్లు ఏర్పాటు చేసిన సిబ్బంది.. అందుకు సంబంధించిన ట్రైల్స్ జరిపారు. ప్రధాని సభ వద్ద భద్రతా ఏర్పాట్లను డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి క్షుణ్ణంగా పరిశీలించారు.
విశాఖకు ప్రధాని: రాత్రి 7.25 గంటలకు ప్రధాని నరేంద్రమోదీ విశాఖకు చేరుకున్నారు. ఈ రాత్రికి తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయంలోని 'చోళ సూట్'లో అతిథిగృహంలో బస చేస్తారు. రేపు ఉదయం 10.10కి బహిరంగ సభ ప్రాంగణానికి ప్రధాని చేరుకోనున్నారు. ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన అనంతరం.. రేపు మధ్యాహ్నం ఐఎన్‌ఎస్ డేగా నుంచి హైదరాబాద్ వెళ్లనున్నారు.
సభలో సుమారు 40నిమిషాల పాటు మోదీ ప్రసంగం: రేపు ప్రధాని పాల్గొనే బహిరంగ సభ వేదికపైకి ప్రధానితో పాటు ముగ్గురుకే అనుమతి లభించింది. ప్రధానితో పాటు వేదికపైన గవర్నర్, సీఎం జగన్, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌లు మాత్రమే ఉంటారు. మరో వేదికపై 100 మందికి పైగా మంత్రులు, రాజకీయ ప్రముఖులు ఆసీనులు కానున్నారు. ఇంకో వేదికపై.. 60 మందికి పైగా కేంద్ర, రాష్ట్రాల ఉన్నతాధికారులు ఉండనున్నారు. ప్రధాని వేదికలో మాట్లాడేందుకు సీఎం జగన్‌కు 7 నిమిషాల సమయం కేటాయించగా.. ప్రధాని మోదీ సుమారు 40 నిమిషాలు మాట్లాడనున్నారు. ప్రధాని మోదీ బహిరంగ సభకు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ అధ్యక్షత వహించనున్నారు.