High Court On Vizag Land issue: ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలని న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల మేరకు వ్యవహరించడంలో విఫలమయ్యారని విశాఖ జిల్లా కలెక్టర్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సోమవారం స్వయంగా కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంతకుమార్ మిశ్రా, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలిచ్చింది. విశాఖ జిల్లా సబ్బవరం గ్రామ పరిధిలోని సర్వే నంబరు 255, 272, 272లోని ఎనిమిదెకరాల భూమిలో కె.దుర్గాప్రసాద్ అనే వ్యక్తి ప్రభుత్వ అధికారుల అండతో భవన నిర్మాణాలు చేపడుతున్నారని విశాఖకు చెందిన వెంకటేశ్వర్లు హైకోర్టులో పిల్ వేశారు.
ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయస్థానం.. సంబంధిత భూమిలో ఎలాంటి నిర్మాణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని గతేడాది సెప్టెంబర్లో జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. తాజాగా ఈ వ్యాజ్యం మరోసారి హైకోర్టులో విచారణకు వచ్చింది. పిటిషనర్ తరపు న్యాయవాది అక్బర్ వాదనలు వినిపిస్తూ.. కోర్టు ఉత్తర్వుల ప్రకారం వ్యవహరించడంలో అధికారులు విఫలమయ్యారన్నారు. మధ్యంతర ఉత్తర్వులకు విరుద్ధంగా నిర్మాణ పనులు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. సంబంధిత ఫోటోలను కోర్టుకు అందజేశారు. వాటిని పరిశీలించిన ధర్మాసనం.. జిల్లా కలెక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.