Golagani Srinivasa Rao as shadow mayor: విశాఖ జీవీఎంసీలో మేయర్ భర్త గోలగాని శ్రీనివాసరావు షాడో మేయర్గా వ్యవహరిస్తున్నారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. మేయర్ భర్త అవినీతికి పాల్పడుతున్నారని పలు అంశాలను మూర్తి యాదవ్ జీవీఎంసి గాంధీ బొమ్మ వద్ద బయటపెట్టారు. అధికార దుర్వినియోగంతోపాటు వివిధ పనులలో పెద్దఎత్తున అవకతవకలకు పాల్పడుతున్న శ్రీనివాసరావుపై విచారణ జరిపించి.. అవినీతి సొమ్మును రాబట్టాలని వైసీపీ పెద్దలను, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీవీఎంసీ మేయర్ క్యాంప్ ఆఫీస్ పేరు చెప్పి లక్షల రూపాయలు దోచుకున్నారన్నారు.
సొంత పనులకు కాంట్రాక్ట్ ఉద్యోగులు..:మేయర్ క్యాంప్ ఆఫీసుకి మహా సంస్థ తరపున 8 మంది, మరో కాంట్రాక్ట్ సంస్థ తరుపున నలుగురిని ఉద్యోగులుగా నియమించి సొంత పనులకు వాడుకుంటున్నారని విమర్శించారు. ఒక్కొక్కరికి రూ.18వేలు జీతమని చెప్పి రూ.10,200 ఇచ్చి.. మిగిలిన సొమ్ములు మేయర్ భర్త గోలగాని శ్రీనివాసరావు తీసుకుంటున్నారని ఆరోపించారు. మేయర్ భర్త వ్యక్తిగత అవసరాలకు ప్రజాధనాన్ని వాడుకుంటున్నారన్నారు. మేయర్ వాడే అధికారిక వాహనం కాకుండా, తమ సొంత వాహనాన్ని మేయర్ అవసరాలకు అద్దె వాహనంగా పెట్టి ఆ సొమ్ములు దిగమింగుతున్నారన్నారు.