విశాఖలో అర్ధరాత్రి ఓ యువతి ఒంటిపై నిప్పంటుకుని గాయపడిన ఘటనలో పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇసుకతోట ప్రాంతానికి చెందిన దివ్య కేజీహెచ్ సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తోంది. మంగళవారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వస్తుండగా బస్టాప్ వద్ద వేచి ఉన్న సమయంలో తన దుస్తులకు కిరోసిన్ గాని, పెట్రోల్ గాని అంటుకుని ఉండవచ్చని..రోడ్డు పక్కన ఉన్న చెత్త మంటల నుంచి నిప్పు రవ్వలు తన బట్టలపై ఎగసిపడి మంటలు చెలరేగినట్లు న్యాయమూర్తి, పోలీసులకు బాధితురాలు వాగ్మూలం తెలియజేసింది. ఈకేసులో బాధితురాలు చెప్పిన అంశాలపై పోలీసులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
యువతి విధులు ముగించుకుని ఇంటికి వెళ్లే సమయంలో ఇసుకతోట బస్టాపు వద్ద కిరోసిన్, పెట్రోల్ వంటి ఆనవాళ్లు కనిపించలేదని, ఆమె ఇల్లు ఒకవైపు ఉంటే ఘటన జరిగిన ప్రదేశం మరోవైపు ఉందని.. కేసులో పోలీసులకు పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. యువతి చరవాణి కూడా ఘటనా స్థలంలో కనిపించకపోవడంతో కేసు ఛేదించడం పోలీసులకు కష్టతరమవుతోంది. ఘటనా స్థలం వద్ద సీసీ కెమెరాలు లేకపోవడంతో ఆధారాలు లభించలేదని ద్వారకా పోలీస్ స్టేషన్ సిఐ తెలిపారు. ప్రస్తుతం ఈ కేసును కాలిన గాయాలు కేసుగా నమోదు చేస్తున్నట్టు తెలిపారు.