ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గిరి'జనాని'కి పోలీసుల బతుకు'బాట'!

ఆంధ్రా - ఒడిశా సరిహద్దు పరిధిలో.. విశాఖ మన్యంలోని గిరిజనులకు పోలీసులు సరికొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. కష్టాలు తీర్చి.. బతుకుబాట చూపారు.

గిరిజనులకు ఉచిత బస్సు సర్వీసు

By

Published : Mar 6, 2019, 10:05 PM IST

గిరిజనులకు ఉచిత బస్సు సర్వీసు
ఆ ప్రాంత గిరిజనులకు గమ్యాన్ని చేరాలంటే నిత్యం నడకే ఆధారం. కావాల్సిన చోటికి ఎప్పుడు చేరతారో తెలియని దుస్థితి. అలాంటి చోటుకు బస్సు వచ్చిందంటే పండగే. ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తే అధిక రుసుములతో వారి జేబులకు చిల్లులు ఖాయం. ఆ డ్రైవర్ల అతివేగానికి అప్పుడప్పుడూ ప్రమాదాల బారిన పడడం అదనం. నిత్యం మండల కేంద్రాలు, కళాశాలకు, సంతలకు వెళ్లి.. తిరిగి సొంత గూటికి చేరడం వారికి ఓ యుద్ధంతో సమానం. ఆంధ్రా ఒడిశా సరిహద్దులో ఉన్న ఈ సమస్యకు.. పోలీసులు పరిష్కారం చూపారు. ఉచిత బస్సు ఏర్పాటు చేసి గిరిజనుల కష్టాలు తీర్చారు.

విశాఖ మన్యం సువిశాల కొండకోనల ప్రాంతం. గిరిజనాభివృద్ధి సంస్థ చాలా ప్రాంతాల్లో రహదారి సౌకర్యం కల్పించినా... ఇప్పటికీ రవాణా సదుపాయాలు లేని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ప్రాంతాల్లో ప్రైవేటు వ్యక్తులు అధిక రుసుము వసూలు చేస్తూ జీపు సర్వీసులు నడుపుతున్నారు. ఎక్కువ సంఖ్యలో జనాలను ఎక్కించడం వల్ల ప్రమాదాల బారిన పడి.. కొందరు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలూ ఉన్నాయి. అందులోనూ మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు కావడంతో ప్రభుత్వ సర్వీసులు ఎప్పుడు ఉంటాయో.. ఎప్పుడు రావో తెలియని దుస్థితి. ఈ కారణంతోనే.. ఏజెన్సీ ప్రాంతంలో ఉచిత రవాణా సర్వీసులు మొదలు పెట్టింది పోలీసు శాఖ.

ఆంధ్రా - ఒడిశా సరిహద్దు ముంచంగిపుట్టు నుంచి కుమడ వరకు ఒక సర్వీసు, జి.మాడుగుల నుంచి మద్దిగరువు వరకు మరో ఉచిత సర్వీసును నడిపిస్తున్నారు. కుమడ బస్సు ప్రారంభించి 2 వారాలు అవుతోంది. ప్రతిరోజు 4 సర్వీసులు చేస్తూ గిరిజనులకు అండగా నిలుస్తోంది. ఈ సౌకర్యం ఏర్పాటు చేసిన పోలీసులకు గిరిజనులు ధన్యవాదాలు తెలుపుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details