ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

GANJAI: రూ.8వేల కోట్ల గంజాయ్‌.. ఆ ముఠాలదే కీలకపాత్ర

విశాఖ మన్యంలో గంజాయి సాగు వేళ్లూనుకుపోయింది(ganja cultivation at visakha manyam). ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో 15 వేల ఎకరాలకుపైగా విస్తీర్ణంలో రహస్యంగా సాగవుతోంది. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు రాష్ట్రంలో ఉండటానికి ఇదే కారణమవుతోంది. ఏటా ఇక్కడ పండిస్తున్న 8వేల కోట్ల విలువైన గంజాయి దేశ, విదేశాలకు తరలుతోందని.. అనధికారికంగా అంచనా వేస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లోకి చేరేసరికి దాని విలువ రూ. 25 వేల కోట్ల పైమాటేనని తెలుస్తోంది.

మన్యంలో వేల ఎకరాల్లో పంట సాగు
మన్యంలో వేల ఎకరాల్లో పంట సాగు

By

Published : Oct 12, 2021, 4:40 AM IST

విశాఖ మన్యం(ganja cultivation at visakha manyam)లో గంజాయి సాగు వేళ్లూనుకు పోయింది. అత్యంత రహస్యంగా పండించే ఈ పంటను ఆంధ్ర- ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో ఏకంగా 15 వేల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో సాగు చేస్తుండటం పరిస్థితి తీవ్రతను చాటిచెబుతోంది. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్‌లో ఉండటానికి కారణమిదే. ఏటా ఇక్కడ పండిస్తున్న రూ.8వేల కోట్ల విలువైన గంజాయి దేశ, విదేశాలకు అక్రమంగా తరలుతోందని అనధికారిక అంచనా. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లోకి చేరేసరికి దాని విలువ రూ.25 వేల కోట్ల పైమాటే. విశాఖ మన్యంలో ఈ పంట సాగు మొదలుకుని దాన్ని దేశం నలుమూలలకు తరలించటం వెనుక మహారాష్ట్ర, తమిళనాడు, కేరళకు చెందిన మత్తు ముఠాలు(heavy ganja cultivation at visakha) కీలకంగా వ్యవహరిస్తున్నాయి.

కొన్నాళ్లుగా ఏపీలోని వివిధ జిల్లాలవారూ ఈ దందాలో క్రియాశీలకంగా మారారు. సరకును ఒక చోట నుంచి మరోచోటికి చేరవేసే కొరియర్లు, తక్కువ మొత్తంలో రవాణా చేసేవారిని పట్టుకోగలుగుతున్న పోలీసు, ఎస్‌ఈబీ అధికారులు.. అసలు సూత్రధారుల గుట్టురట్టు చేయలేకపోతున్నారు. రోడ్డు, రైలు మార్గాల ద్వారా నిత్యం వేల టన్నుల గంజాయి ఏపీ మీదుగా దర్జాగా తరలిపోతున్నప్పటికీ అందులో 2-3 శాతాన్ని మాత్రమే దర్యాప్తు సంస్థలు పట్టుకోగలుగుతున్నాయి. గతంలో ఎప్పుడైనా పదుల కిలోల గంజాయి మాత్రమే దొరికేది. ఇప్పుడు వందల కిలోల్లో దొరకడం తీవ్రతకు అద్దం పడుతుంది. మిగతాదంతా ఏపీలోనూ, ఇతర రాష్ట్రాల్లోనూ ఎక్కడోచోట వినియోగంలోకి వచ్చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.

సాగు దశ నుంచే పాగా వేసి..

కొన్నేళ్ల కిందట వరకూ విశాఖపట్నం మన్యంలో వందల ఎకరాల్లోనే గంజాయి సాగయ్యేది. అది కూడా వ్యవస్థీకృతం కాదు. అయితే ఈ ప్రాంతం మత్తు ముఠాలకు అత్యంత అనుకూలంగా ఉండటంతో పాటు నాణ్యమైన, భారీగా డిమాండున్న శీలావతి రకం గంజాయి ఇక్కడ పండటంతో కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల మాదకద్రవ్యాల(drugs gangs) ముఠాలు పాగా వేశాయి. గిరిజనుల భూముల్ని కౌలుకు తీసుకుని, వారితోనే గంజాయి సాగు చేయిస్తున్నాయి. ఇలా పండించిన మత్తుపదార్థాన్ని దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలించి రూ.వేల కోట్లు అక్రమంగా ఆర్జిస్తున్నాయి. ఇటీవల ఏపీలోని కొన్ని జిల్లాల నుంచి వెళ్లినవారూ అక్కడ పాగా వేస్తున్నారు.

తీగ లాగి.. డొంక వదిలేస్తున్నారు

పోలీసు, ఎస్‌ఈబీ అధికారులు నిత్యం ఎక్కడోచోట దాడులు చేసి గంజాయి పట్టుకుంటున్నారు. రవాణాదారుల్ని, కొరియర్లను పట్టుకుని వారిపై కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారు. విశాఖ మన్యం నుంచి విదేశాల వరకూ వేళ్లూనుకుపోయిన మత్తు మాఫియా మూలాలను ఛేదించటంలో మాత్రం విఫలమవుతున్నారు. మన్యం గ్రామాల్లోకి కొత్తగా ఎవరొస్తున్నారు? వారి మూలాలేంటి? ఎక్కణ్నుంచి వచ్చారు? ఎందుకొచ్చారు అనే అంశాలపై నిఘా ఉండట్లేదు. సరఫరా దశలో గంజాయి ఎక్కడికి చేరుతుందో గుర్తించగలిగినా సూత్రధారుల మూలాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాంటి ప్రయత్నాలేవీ కనిపించట్లేదు.

ఎక్కడెక్కడికి వెళుతుందంటే..

*ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, హరియాణా, పశ్చిమబెంగాల్‌, సిక్కిం, నాగాలాండ్‌, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, చెన్నై, ఒడిశా, తెలంగాణలకు..

*ఏపీ నుంచి తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు, అక్కడి నుంచి ఈశాన్య రాష్ట్రాలకు..

*చెన్నై మీదుగా సముద్ర మార్గంలో శ్రీలంక, ఇతర దేశాలకు.. ఎక్కడ దొరికినా.. మూలాలు ఏపీలోనే! దేశంలో ఏ ప్రాంతంలో గంజాయి దొరికినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంటున్నాయి.

*ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూ- ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వే మీదుగా వెళ్తున్న ఓ వాహనాన్ని డీఆర్‌ఐ అధికారులు తనిఖీ చేయగా రూ.1.45 కోట్ల విలువైన 972 కిలోల గంజాయి దొరికింది.

*తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో సరఫరా చేసేందుకు ఏపీ నుంచి తరలిస్తున్న 120 కిలోల గంజాయిని చెన్నై పోలీసులు జులై నెలలో పట్టుకున్నారు. దాన్ని తీసుకెళ్తున్న ముగ్గురు వ్యక్తుల్ని అరెస్టు చేశారు.

*గంజాయిని ద్రవరూపంలోకి మార్చి గుజరాత్‌లోని వడోదరకు తరలించే ప్రయత్నంలో ఉన్న ఓ ముఠాను ఇటీవల గుంటూరు అర్బన్‌ పోలీసులు అరెస్టు చేశారు.

*పొరుగునున్న హైదరాబాద్‌ అయితే ఏపీ నుంచి తరలే గంజాయికి రవాణా కేంద్రంగా మారింది. ఈ నగరంలో తరచూ ఎక్కడోచోట గంజాయి దొరుకుతూనే ఉంది.

*మహారాష్ట్రకు చెందిన కాలే గ్యాంగ్‌, పవార్‌ గ్యాంగ్‌ వంటివి గంజాయి అక్రమ రవాణాలో కీలకంగా వ్యవహరిస్తున్నాయి.

మన్యంలో సాగు అంచనా

*ఒక్కో గంజాయి మొక్క నుంచి సగటు దిగుబడి 250- 350 గ్రాములు

*ఎకరం విస్తీర్ణంలో సగటు దిగుబడి 1000 కిలోలు

*నాణ్యతను బట్టి కిలో గంజాయి ధర సగటున రూ.2,500-రూ.3,000

*ఎకరా గంజాయి సాగుతో ఆదాయం సీజన్‌కు రూ.30 లక్షలు చొప్పున రెండు సీజన్లకు రూ.60 లక్షలు

*ఎకరా సాగుకు ఖర్చు రెండు సీజన్లకు రూ.5 లక్షలు

*ఎకరాకు మిగులు రూ.55 లక్షలు

* ఏవోబీలో గంజాయి సాగు విస్తీర్ణం: సుమారు 15 వేల ఎకరాలు

*ఏటా 15 వేల ఎకరాల్లో సాగుతో మత్తు ముఠాలకు లభిస్తున్న నికర ఆదాయం: దాదాపు రూ.8,000 కోట్లు

*ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో ఆ గంజాయి రేటు కనీసం మూడు రెట్లు అధికంగా ఉంటుంది. ఈ లెక్కన జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లోకి చేరేసరికి దాని విలువ రూ.25 వేల కోట్లపైనే ఉంటుంది.

ABOUT THE AUTHOR

...view details