కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించటంతో రాష్ట్రంలోని మత్స్యకారుల జీవనం దుర్భరంగా మారింది. చేపల వేట ఆపటంతో పూట గడిచేందుకు కష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా విశాఖలోని పెద్ద జాలరిపేటలో సుమారు 1500 కుటుంబాలు చేపల వేటపై ఆధారపడి బతుకున్నాయి. ఈ మత్స్యకార కుటుంబాల్లో మగవారు వేటకు వెళితే, మహిళలు చేపలు విక్రయించి ఉపాధి పొందుతుంటారు. లాక్డౌన్ కారణంగా సంప్రదాయ మత్స్యకారుల ఆర్థిక స్థితి కునారిల్లిపోయింది. ఉపాధి లేకపోవటంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని వారు అంటున్నారు.
గతి తప్పిన గంగపుత్రుల జీవన నావ..!
రాష్ట్రంలోని గంగపుత్రుల పరిస్థితి సుడిగుండంలో చిక్కుకున్న పడవలా మారింది. సంద్రంలో వేటతో పొట్ట నింపుకునే వారిపై లాక్డౌన్ పిడుగు పడింది. రెక్కాడితే డొక్కాడని ఆ బతుకులు ఉపాధి లేక అల్లకల్లోలంగా మారాయి. ప్రభుత్వమే తమను ఈ కష్టాల నుంచి ఒడ్డుకు చేర్చాలని కోరుకుంటున్నారు.
fisherman in ap
చేయూతనివ్వాలి
రాష్ట్ర ప్రభుత్వం తమకు ఉచితంగా రేషను, పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని సంప్రదాయ మత్స్యకారులు కోరుతున్నారు. ఆరు నెలల పాటు ఇంటి అద్దెలు, కరెంటు ఛార్జీల నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి:34 కొత్త కేసులు.. ముగ్గురు పిల్లలకు కరోనా పాజిటివ్