ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తమ్ముడి కోసం అన్న... కుమారుల కోసం తండ్రి... కుటుంబాన్నే వెంటాడింది మృత్యువు - news updates in vizag district

ఎంతో ఆనందంగా ఉన్న ఆ తండ్రీకుమారులపై మృత్యువు కన్నెర్ర చేసింది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన తమ్ముణ్ని ఆస్పత్రిలో చేర్చిన అన్న... మరో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న తండ్రి... కుమారులను చూసేందుకు ఆస్పత్రికి వస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన తండ్రీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

father and son died in different road accidents in paderu vizag district
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో తండ్రీకొడుకులు మృతి.. మరో కుమారుడికి గాయాలు

By

Published : Jan 2, 2021, 5:14 PM IST

Updated : Jan 2, 2021, 8:00 PM IST

కొన్ని ప్రమాదాలు చూస్తే తెలియకుండానే కన్నీళ్లు ఉబికి వస్తాయి. మత్యువు పగబట్టినట్టు ఒకే కుటుంబాన్ని వెంటాడుతుందా అనే అనుమానం కలుగకమానదు. ఇలాంటి దుర్ఘటనే విశాఖ జిల్లాలో జరిగింది. ప్యాక్షన్ పగలా మృత్యువు ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. ఇద్దర్ని బలి తీసుకుంది. ఇంకొకర్ని ఆసుపత్రి పాల్చేసింది. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబం... తీవ్ర విషాదంలో కూరుకుపోయింది. ఆ గ్రామమంతా బోరున విలపిస్తోంది.

చిన్న కుటుంబంలో మృత్యు చిచ్చు

విశాఖపట్నం జిల్లా హుకుంపేట మండలం గరుడపల్లి గ్రామానికి చెందిన మర్రి బిచ్చు చిన్న కుమారుడు విష్ణు(30) రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న బిచ్చు పెద్ద కుమారుడు మల్లేశ్​ కుమార్​(35) తమ్ముణ్ని పాడేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స అందించారు. ఆయన పరిస్థితి కాస్త కుదుటపడిన తర్వాత...తమ్ముడి ప్రమాదం విషయాన్ని కుటుంబానికి చెబుదామని ఆసుపత్రి నుంచి మల్లేశ్ ద్విచక్రవాహనంపై ఇంటికి బయల్దేరాడు.

మల్లేశ్​ను మింగేసిన మృత్యువు

కొంత దూరం వెళ్లేసరికి మల్లేశ్​ వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఎదురుగా వస్తున్న ఆటో ఢీ కొట్టింది. పత్రిమెట్ట వద్ద జరిగిన ఈ ప్రమాదంలో మల్లేశ్​ అక్కడికక్కడే చనిపోయాడు. ఆయన గురించి తెలిసిన వ్యక్తులు ఈ దుర్ఘటన సంగతిని మల్లేశ్​ తండ్రి బిచ్చుకు చేరవేశారు. కన్నబిడ్డ ప్రమాదానికి గురైన సంగతి తెలుసుకున్న బిచ్చు.. చింతపల్లి నుంచి హడావుడిగా బయల్దేరాడు.

కుమారులను చూడటానికి వస్తున్న తండ్రి అలా..

దొరికిన ఆటో పట్టుకొని కుమారుణ్ని చూసేందుకు తండ్రి బిచ్చు వస్తుండగా మరో ప్రమాదం జరిగింది. జి. మాడుగుల మండలం బంధవీధి వద్ద ఆయన ప్రయాణిస్తున్న ఆటో బోల్తా పడింది. తీవ్రంగా గాయపడిన ఆయన్ని విశాఖ కేజీహెచ్​కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న బిచ్చును మృత్యువు కమ్మేసింది.

దాతల సాయంతోనే అంత్యక్రియలు

ఓ కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే... మరో కుమారుడు ప్రమాదంలో మరణించాడు. వారిని చూసేందుకు వెళ్తున్న తండ్రి ఇలా మృత్యువాత పడ్డాడు. ఈ దుర్ఘటనలు తెలుసుకున్న ఆ కుటుంబం కూలబడిపోయింది.

ఇప్పుడు వాళ్ల అంత్యక్రియలకూ డబ్బుల్లేవని గ్రామస్థులు తెలిపారు. విషయాన్ని ప్రజాప్రతినిధులకు చేరవేస్తే... వారు సాయం చేసేందుకు అంగీకరించారు.

ఇదీచదవండి.

రణరంగంగా రామతీర్థం...విజయ సాయిరెడ్డికి నిరసన సెగ

Last Updated : Jan 2, 2021, 8:00 PM IST

ABOUT THE AUTHOR

...view details