విశాఖ జిల్లాలో రైతులు పంటను కోనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి నిరుత్సాహంతో వెనుతిరుగుతున్నారు. తీరప్రాంతాల నుంచి చేపలు తీసుకొచ్చిన వారిని కూడా అధికారులు అనుమతించడం లేదు. వీరు ఊరవతలకు తీసుకువెళ్లి ఆటోల్లోనే విక్రయించారు. పోలీసులు వస్తారని భావించిన కొనుగోలుదారులు ఒక్కసారిగా గుమికూడటంతో ఇదే అదనుగా వ్యాపారులు రెట్టింపు ధరకు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు.
రైతులంతా తిరిగి వెళ్లిపోయిన తర్వాత ఎనిమిది గంటల సమయంలో రైతుబజారు గేట్లు తెరుచుకున్నప్పటికీ దాదాపుగా బోసిపోయి కనిపించింది. నర్సీపట్నం, బలిఘట్టం మార్కెట్‌ల్లోనూ ఇదే పరిస్థితి. దీనిపై పట్టణ సీఐ స్వామినాయుడుని వివరణ కోరగా.. శనివారం వర్షం పడిందని, నేలంతా బురదగా మారిందని చెప్పారు. ఆదివారం ఆకాశం మేఘావృతమైందని.. కొనుగోలుదార్లు ఇబ్బంది పడతారనే తొలుత దుకాణాలు వేయనివ్వలేదన్నారు. వర్షం రాకపోవడంతో 8 గంటల తర్వాత అనుమతించామని చెప్పారు.