ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రధాని సభ పేరిట ఆంధ్రవిశ్వవిద్యాలయంలో పర్యావరణ ధ్వంసం - ప్రధాని విశాఖ పర్యటన వార్తలు

Trees cutting agitation in Andhra University: ఈనెల 11, 12 తేదీల్లో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తోందని పర్యావరణ వేత్తలు ఆరోపిస్తున్నారు. పెద్ద పెద్ద వృక్షాలను తొలగించేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని సభను సాకుగా చూపి అవసరం లేని చోట చదును చేసేస్తున్నారని స్థానికుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది

Andhra University campus
Andhra University campus

By

Published : Nov 8, 2022, 8:33 AM IST

పెద్ద పెద్ద వృక్షాలను సైతం తొలగించిన అధికారులు

Trees cutting agitation:ఆంధ్రా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానం ఒకప్పుడు సహజసిద్ధమైన మట్టి దిబ్బలతో కోత నివారించే వృక్షాలతో పచ్చగా కళకళలాడేది. మిగిలిన ప్రాంతం కంటే ఇక్కడ ఉష్ణోగ్రత తక్కువగా నమోదయ్యే సందర్భాలు ఉండేవి. ఇప్పుడవన్నీ మాయమవుతున్నాయి. పెద్ద పెద్ద వృక్షాలను తొలగించేశారు. ప్రధాని సభను సాకుగా చూపి అవసరం లేని చోట చదును చేసేస్తున్నారని ఆందోళన వ్యక్తమవుతోంది.

తూర్పు తీరంలో సహజ సిద్ధమైన కొండలు, వాటి నుంచి జాలువారే నీటిని అలవోకగా ఒడిసి పట్టే వన ప్రాంతాలు ఉండే క్షేత్రంగా విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉండేది. ఫలితంగా వాల్తేర్, సీతమ్మధార వంటి ప్రాంతాల నుంచి సహజంగా వచ్చే వర్షపు నీటిని ఇక్కడి భూమి ఒడిసి పట్టి.. భూగర్భ జలాలు పెంపొందింపజేయడమే కాకుండా, సముద్రపు నీరు చొచ్చుకు రాకుండా నిరోధించేది. రెండేళ్ల నుంచి ఈ ప్రాంతంపై పెద్దల కన్ను పడిందన్న ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ప్రచారంలోకి తెచ్చి.. డొంకలను, పెద్ద పెద్ద వృక్షాలను సైతం తొలగించేశారు. దీనిపై అందోళనలు జరిగినా విశ్వవిద్యాలయం యంత్రాంగం మౌనం వహించింది.

'వాల్టా చట్టాన్ని ఆంధ్రప్రదేశ్లోని వైకాపా ప్రభుత్వం అపహాస్యం చేస్తోంది. ఈనెల 11, 12 తేదీల్లో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తోంది. మోడీ పర్యటన పేరుతో ఎన్నో ఏళ్ల నుంచి జీవిస్తున్న పెద్దపెద్ద వృక్షాలను నేలమట్టం చేసి సభకు ఏర్పాట్లు చేయడం సమంజసం కాదు. వాల్టా చట్టం ఉల్లంఘన వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిల్లు దాఖలైన నేపథ్యంలో, వాల్టా చట్టాన్ని పరిరక్షించాలని సాక్షాత్ హైకోర్టు తీర్పు చెప్పినప్పటికీ ఇక్కడ జీవీఎంసీ అధికారులు పట్టించుకోకుండా చెట్లను నేలమట్టం చేస్తున్నారు. అడవులు పెంచాలని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. ఆంధ్రప్రదేశ్లో మాత్రం వాల్టా చట్టం సరిగ్గా అమలు కావడం లేదు. వాల్టా చట్టం ఉల్లంఘనకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి' మూర్తి యాదవ్ జనసేన కార్పొరేటర్

ఇంజనీరింగ్ కళాశాల మైదానం 19 ఎకరాలు, ఎదురుగా ఉన్న 11 ఎకరాలను ఇదే అదనుగా చదును చేసేస్తున్నారు. ఇందులో అధికార పక్ష నేతలు స్వయంగా పర్యవేక్షిస్తూ, అధికారులకు సూచనలు ఇస్తూ ఏర్పాట్లలో పాలుపంచుకుంటున్నారు. పర్యావరణ హితంగా విశ్వవిద్యాలయాన్ని అభివృద్ది చేయాల్సిన తరుణంలో, ఈ రకంగా ప్రధాని పర్యటనను సాకుగా చూపి విధ్వంసం చేయడాన్ని.. ప్రజా సంఘాలు రాజకీయ పక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అధికారులు స్పందించి చెట్ల నరికివేతను నిలిపివేయాలని,పర్యావరణాన్ని రక్షించాలని స్థానికులు కోరుతున్నారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details