Delay In Appointment Of Vice-Chancellors In AP: పద్మావతి మహిళా వర్సిటీ, యోగివేమన, కృష్ణా, ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయాల వీసీల పదవీకాలం జనవరి 7తో ముగియనుంది. ఆయా పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసేందుకు అనుమతివ్వాలని.. అక్టోబర్ మొదటి వారంలో ఉన్నత విద్యాశాఖకు ఉన్నత విద్యామండలి దస్త్రాన్ని పంపింది. దీన్ని వెంటనే పరిష్కరించాల్సిన ఉన్నత విద్యాశాఖ.. నవంబర్ మొదటి వారం వరకు అట్టిపెట్టుకుంది. ఆ తర్వాత కొత్త వీసీల ప్రకటనకు ఆమోదం తెలుపుతూ ఉన్నత విద్యామండలికి దస్త్రాన్ని పంపగా.. 20 రోజులుగా ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు.
నిబంధనల ప్రకారం ఉన్నత విద్యాశాఖ నుంచి దస్త్రం వచ్చిన వెంటనే ప్రకటన విడుదల చేయాలి. ఆ తర్వాత దరఖాస్తుల స్వీకరణ, పరిశీలనకు నెలన్నర పడుతుంది. సెర్చ్ కమిటీలో యూజీసీ తరఫున నామినీ నియామకానికి నెల రోజుల సమయం కావాలి. ఉన్నత విద్యాశాఖ నెల రోజులపాటు దస్త్రాన్ని ఆపేయగా.. ఉన్నత విద్యామండలి 20 రోజులుగా ప్రకటన ఇవ్వకుండా పక్కన పెట్టింది. దీనివల్ల డిసెంబర్‌లో ప్రకటన ఇచ్చినా కొత్త వీసీ పోస్టులు భర్తీకి సమయం సరిపోదని.. ప్రస్తుతమున్న వారికే 6 నెలలు పొడిగించాలని ఉన్నత విద్యామండలి ప్రతిపాదిస్తోంది. యోగివేమన, పద్మావతి మహిళ, కృష్ణా విశ్వవిద్యాలయాల వీసీలు ఉన్నత స్థాయిలోని ఓ వ్యక్తికి కావాల్సినవారని.. అందువల్లే ఈ విధంగా చేశారనే విమర్శలు వస్తున్నాయి. వీరివల్ల ఆదికవి నన్నయ వర్సిటీ వీసీ పోస్టు భర్తీ కూడా పెండింగ్‌లో ఉంది.