విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగి పదిరోజులు దాటుతున్నా బాధిత గ్రామాల్లో అందుతున్న సౌకర్యాలు అరకొరగానే ఉన్నాయి. విషవాయువు ప్రభావం తక్కువగా ఉన్న గ్రామాలకు ప్రజలు చేరుకున్నప్పటికీ... వారికి ఆహారం తప్ప వేరే సౌకర్యాలు అందట్లేదు. ప్రభావం ఎక్కువగా ఉన్న గ్రామాల్లోని ఇళ్లలోంచి విషవాయువు ఇంకా బయటకు పోవట్లేదు. ఎంత శుభ్రపరిచినా ఇదే పరిస్థితి ఉందని వాపోతున్నారు. ముఖ్యంగా ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ గోడను ఆనుకుని ఉన్న వెంకటాపురంలో విషవాయువు ప్రభావాన్ని తగ్గించేందుకు గ్రామస్థులు చేయని ప్రయత్నం లేదు. అయినప్పటికీ ఘాటైన వాయువు ప్రభావం ఉంటోందని, ఊపిరితీసుకోవటమే కష్టంగా ఉంటోందని గ్రామస్థులు వాపోయారు.
జీవితపోరాటం సాగిస్తున్న 'ఎల్జీ పాలిమర్స్' బాధిత గ్రామస్థులు
విశాఖలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ప్రమాదం నుంచి బయటపడిన ప్రజలు జీవన పోరాటం సాగిస్తున్నారు. ఆ పరిశ్రమగానీ, ప్రభుత్వంగానీ వైద్యపరీక్షలు నిర్వహించకపోవటంపై నిరసన వ్యక్తం చేశారు. ఎంత శుభ్రపరిచినా విషవాయువు పోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లలోనూ ఉండలేక, వేసవిలో రోడ్లపైనా జీవించలేక సతమతమవుతున్నామన్నారు.
ప్రమాదం జరిగిన తరువాత అప్పటివరకూ తమ ఇళ్లల్లో ఉన్న సామగ్రినంతా బాధిత గ్రామ ప్రజలు బయటపడేశారు. ఇప్పుడు ప్రభుత్వం, పరిశ్రమ పెట్టే ఆహారంపైనే ఆధారపడుతున్నారు. జీవీఎంసీ అందిస్తున్న నీటితోనే నిత్యావసరాలు తీర్చుకుంటున్నారు. స్థానికంగా లభించే నీరు విషపూరితమైందనే భయం ఇంకా వారిని వెంటాడుతోంది. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నవారికి వైద్య పరీక్షలు నిర్వహించటంలో ప్రభుత్వం, పరిశ్రమ చూపుతున్న నిర్లక్ష్యంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్యాస్ ప్రభావంతో యువతీయువకులకు పెళ్లిళ్లు జరిగే పరిస్థితి లేదని బాధపడుతున్నారు. గ్రామాల్లోని గర్భిణీలు, వృద్ధుల ఆవేదన వర్ణనాతీతం. కళ్ల మంటలు ఇంకా తగ్గలేదని, నష్టపరిహారం ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంటే సరికాదని అంటున్నారు. గ్యాస్ లీక్ ప్రభావం ఎక్కువగా తమ గ్రామంపైనే పడిందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించాలని వెంకటాపురం వాసులు కోరుతున్నారు. విషవాయువు ప్రభావం కొన్ని నెలల్లో పోయేది కాదని, దీంతో భవిష్యత్తులో సంభవించే అనారోగ్యాలకు చికిత్స చేసేందుకు శాశ్వత ఆసుపత్రి నిర్మించాలని స్థానికులు కోరారు.
ఇవీ చదవండి