Geetham Medical College : గీతం వైద్య కళాశాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. వేకువజామునే గీతం వర్సిటీ ప్రధాన ద్వారాల వద్ద భారీగా మోహరించిన పోలీసులు, రెవెన్యూ అధికారులు కళాశాల మైదానాన్ని స్వాధీన పరుచుకున్నారు. దాని చుట్టూ ఇనుప కంచె ఏర్పాటు చేశారు. కళాశాలను అనుకొని 14 ఎకరాల స్థలాన్ని స్వాధీనపరచుకున్నట్లు భీమిలి ఆర్డీవో భాస్కర్‌రెడ్డి తెలిపారు. రుషికొండ గ్రామ సర్వే నం.37, 38లోని స్థలం స్వాధీనం చేసుకున్నట్లు ఆర్డీవో వివరించారు. గతంలోనే ఈ స్థలాన్ని మార్క్ చేశామని.. ఇవాళ 5.25 ఎకరాల్లో కంచె వేశామని ఆయన వెల్లడించారు. పని తొందరగా జరగాలనే తెల్లవారుజాము నుంచి కంచె పనులు ప్రారంభించమని పేర్కొన్నారు. పదిచోట్ల ప్రభుత్వ భూమిగా బోర్డులు పెట్టామని.. ఇద్దరు తహశీల్దార్లు పర్యవేక్షిస్తున్నారని ఆర్డీవో పేర్కొన్నారు.
విశాఖలో గీతం కళాశాల వద్ద ఉద్రిక్తత.. 14 ఎకరాల భూమి స్వాధీనం - గీతం కళాశాల వద్ద పోలీసులు
06:12 January 06
కళాశాల మైదానం చుట్టూ ఇనుప కంచె
ఈ రోజు వేకువజాము నుంచే అధికారులు భారీగా ఈ ప్రాంతానికి చేరుకున్నారు. పలు యంత్రాలతో రెవెన్యూ, జీవీఎంసీ అధికారులు.. ఎండాడ, రుషికొండ వైపు బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేశారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే రాకపోకల నిలిపివేతకు పోలీసులు చర్యలు చేపట్టారు. గీతం వర్సిటీ మార్గంలో రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు.
"ఇప్పుడు స్వాధీనం చేసుకున్నవి ప్రభుత్వ భూములు కావటంతో గతంలో.. మార్కింగ్ చేశాము. కానీ, కంచె ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు ఏర్పాటు చేశాము. ఒకవైపు మాత్రమే ఏర్పాటు చేశాము. మిగతా మూడు వైపుల ప్రభుత్వ భూమి ఉంది. సాధారణంగా ప్రభుత్వ భూమిని స్వాదీనం చేసుకునేటప్పుడు ఉదయాన్నే పనులు ప్రారంభిస్తాము. కూలీలు అలసి పోకుండా ఉండాలని ఇలా చేస్తాము. పని తొందరగా పూర్తవుతుందని అంతే. ఈ పనులు పూర్తైనా తర్వాత.. రోజు వెళ్లే విధులకు వెళ్లొచ్చని ఇలా చేస్తారు." -భాస్కరరెడ్డి, భీమిలీ ఆర్డీవో
ఇవీ చదవండి: