ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

GANJA SMUGGLING: అమెజాన్ ద్వారా గంజాయి స్మగ్లింగ్.. కోట్లలో బిజినెస్!

ganja smuggling through amazon: అమెజాన్ ద్వారా మన్యం నుంచి ఇతర రాష్ట్రాలకు 8 నెలల్లోనే 725 సార్లు గంజాయి సరఫరా చేయబడిందని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(ఎస్‌ఈబీ) దర్యాప్తు తెలిపింది. కోటి 45 లక్షల విలువ చేసే 1,450 కిలోల గంజాయి తరలించినట్లు ప్రాథమికంగా వెల్లడైంది.

delivery-of-725-marijuana-parcels-in-8-months-by-amazon
అమెజాన్ ద్వారా గంజాయి స్మగ్లింగ్.. కోట్లలో బిజినెస్!

By

Published : Dec 22, 2021, 6:59 AM IST

విశాఖపట్నం మన్యం నుంచి మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌లోని వివిధ ప్రాంతాలకు ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ ద్వారా 8 నెలల్లో 725 సార్లు గంజాయి పార్సిళ్లు వెళ్లినట్లు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(ఎస్‌ఈబీ) దర్యాప్తులో తేలింది. ఒక్కో పార్సిల్‌లో రెండేసి కిలోల చొప్పున 1,450 కిలోలు తరలినట్లు ప్రాథమికంగా వెల్లడైంది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి నవంబరు 12 మధ్య రూ.1.45 కోట్ల విలువైన గంజాయి సరఫరా చేసినట్లు దర్యాప్తులో వెలుగుచూసింది. బాబు టెక్స్‌ సంస్థ పేరుతో 364 సార్లు, మరో ఆరు సంస్థల పేర్లతో 361 సార్లు గంజాయి పార్సిళ్లు వెళ్లాయి. సూపర్‌ నేచురల్‌ స్టీవియా లీవ్స్‌ సరఫరా ముసుగులో గంజాయి స్మగ్లింగ్‌ సాగింది. ఇదే తరహాలో ఇంకా ఏవైనా ముఠాలు ఈ-కామర్స్‌ వేదికలను వినియోగించి స్మగ్లింగ్‌ చేస్తున్నాయా? అనే కోణంలో ఎస్‌ఈబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఆర్డరు పెట్టేదీ... సరఫరా చేసేదీ వారే

  • ముఠా సూత్రధారులైన మధ్యప్రదేశ్‌కు చెందిన ముకుల్‌ జైస్వాల్‌, సూరజ్‌ పవయ దేశంలోని వివిధ ప్రాంతాల్లోని వాణిజ్య సంస్థలు, దుకాణాలపై రాసి ఉండే వాటి పేర్లు, జీఎస్టీ నంబర్లు సేకరించారు. ఆ పేరు, జీఎస్టీ నంబరు ఉపయోగించి చిరునామా మార్చేసి విక్రేతలు(వెండర్స్‌)గా అమెజాన్‌లో వివరాలు నమోదు చేసుకున్నారు.
  • తాము ఆయుర్వేద ఉత్పత్తులు, సూపర్‌ నేచురల్‌ స్టీవియా లీవ్స్‌ అమ్ముతామంటూ అందులో చూపించారు. రెండు కిలోల స్టీవియా లీవ్స్‌ ధర రూ.180గా పేర్కొన్నారు. నిజంగానే స్టీవియా లీవ్స్‌, ఆయుర్వేద ఉత్పత్తులు కావాల్సిన వారు అందులో ఆర్డరు పెడితే ‘స్టాకు లేదు (నోస్టాక్‌)’ అని చూపించేలా ఏర్పాటు చేసుకున్నారు.
  • ముకుల్‌ జైస్వాల్‌, సూరజ్‌ పవయ.. తాము విశాఖ నుంచి గంజాయి దిగుమతి చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం వారే అమెజాన్‌లో స్టీవియా లీవ్స్‌ కోసం ఆర్డరు పెట్టేవారు. మధ్యప్రదేశ్‌లోని చిరునామాకు సరఫరా చేయాలని ఆ ఆర్డరులో పొందుపరిచేవారు. దాని ఆధారంగా జనరేట్‌ అయ్యే ఇన్‌వాయిస్‌ను విశాఖపట్నంలోని ఆపరేటర్‌కు పంపించేవారు.
  • ఆ ఆపరేటర్‌ చిన్నచిన్న బాక్సుల్లో రెండేసి కిలోల చొప్పున గంజాయి నింపి ప్యాక్‌ చేసి.. వాటిపై ఆ ఇన్‌వాయిస్‌ అతికించి అమెజాన్‌ పికప్‌ బాయ్‌లకు అందించేవారు. అది అక్కడి నుంచి హైదరాబాద్‌కు చేరి మధ్యప్రదేశ్‌కు తరలిపోయేది.
  • అధికారికంగా చూస్తే స్టీవియా లీవ్స్‌ కోసమే ఆర్డరు వచ్చినట్లు, అవే సరఫరా అవుతున్నట్లు ఉండేది. కానీ ఆ పార్సిళ్లలో స్టీవియా లీవ్స్‌కు బదులు గంజాయి ఉండేది.
  • ఈ ప్రక్రియ మొత్తాన్ని పర్యవేక్షించేందుకు ముకుల్‌ జైస్వాల్‌, సూరజ్‌ పవయ నెలకోసారి విమానంలో మధ్యప్రదేశ్‌ నుంచి విశాఖపట్నం వచ్చేవారు.

దొరకని స్మగ్లర్లు 648 మంది

ఆంధ్ర-ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లోని విశాఖ మన్యం కేంద్రంగా సాగవుతున్న గంజాయి స్మగ్లింగ్‌లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న దాదాపు 648 మంది స్మగ్లర్లు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నారు. వీరిలో ఎక్కువ మంది తెలంగాణ, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల వారే. కొన్నేళ్ల కిందట వరకూ విశాఖ మన్యంలో వందల ఎకరాల్లోనే గంజాయి సాగయ్యేది. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర ముఠాలు వచ్చి పెట్టుబడి పెట్టి సాగు చేయించటం మొదలుపెట్టాక గత పదేళ్లలో అది విస్తృతమైంది. విశాఖ మన్యం నుంచి దేశ, విదేశాలకు తరలింపు ఎక్కువైంది.

ఈ పదేళ్లలో పోలీసులు నమోదుచేసిన కేసుల్లో 16 రాష్ట్రాలకు చెందిన 5,254 మంది స్మగ్లర్లు నిందితులుగా తేలారు. గత కొన్నాళ్లుగా వీరిలో 4,606 మందిని ఇప్పటివరకూ అరెస్టుచేశారు. ఇతర రాష్ట్రాల స్మగ్లర్లలో పట్టుబడకుండా తప్పించుకు తిరుగుతున్న వారు 648 మంది వరకూ ఉన్నారని ఎస్‌ఈబీ గుర్తించింది. విశాఖపట్నంలో ఇటీవల జరిగిన దక్షిణాది రాష్ట్రాల పోలీసు, ఇతర శాఖల ఉన్నతాధికారుల ప్రాంతీయ సదస్సులో.. ఆయా రాష్ట్రాల ఉన్నతాధికారులకు పట్టుకోవాల్సిన స్మగ్లర్ల జాబితాను ఏపీ పోలీసు, ఎస్‌ఈబీ అధికారులు అందజేశారు.

ఇదీ చూడండి:

CM Jagan News: రూ.10 చెల్లిస్తే ఇంటిపై సర్వహక్కులు: సీఎం జగన్​

ABOUT THE AUTHOR

...view details