విశాఖలో అక్రమంగా కిడ్నీ మార్పిడి జరిగిందన్న వ్యవహారంపై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ తన నివేదికను సిద్ధం చేసింది. కేజీహెచ్ సూపరింటెండెంట్ అర్జున నేతృత్వంలోని కమిటీ నివేదికను కలెక్టర్ కే. భాస్కర్‌కు అందించింది. ఐదు పేజీలతో కూడిన నివేదికను, 150 రికార్డులను అందజేసింది. కిడ్నీ మార్పిడి కేసులో శ్రద్ధ ఆసుపత్రిపై వచ్చిన ఆరోపణలు వాస్తవమని తేల్చింది. నిబంధనలకు విరుద్ధంగా 29 మందికి శస్త్రచికిత్సలు చేసినట్లు నివేదికలో వెల్లడించింది. ఈ నేపథ్యంలో శ్రద్ధ ఆసుపత్రులను సీజ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
మరోవైపు ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తూ విశాఖ పోలీసు కమిషనర్ మహేశ్ చంద్ర లడ్డా నిర్ణయం తీసుకున్నారు. విశాఖ వెస్ట్ ఏసీపీ దేవ ప్రసాద్‌ను సిట్ అధికారిగా నియమించారు. అక్రమంగా అవయవ మార్పిడులకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం సమగ్ర విచారణ చేయనుంది.