Rishikonda Illegal Mining today updates: విశాఖపట్నంలోని రిషికొండపై నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతున్నాయని గతంలో జనసేన పార్టీ కార్పోరేటర్ మూర్తి యాదవ్, తెలుగుదేశం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ వేసిన పిటిషన్లపై ఈరోజు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (హైకోర్టు) విచారణ జరిపిన విషయం తెలిసిందే. విచారణలో భాగంగా రిషికొండపై జరుగుతున్న తవ్వకాలు, భవన నిర్మాణాలపై క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి విచారణ చేపట్టి నివేదికను సమర్పించాలంటూ.. ఇటీవలే ఐదుగురు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో న్యాయస్థానం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో రిషికొండ తవ్వకాలకు సంబంధించిన నివేదికను నేడు కేంద్ర కమిటీ హైకోర్టుకు సమర్పించింది. సమర్పించిన ఆ నివేదికలో పలు కీలక విషయాలను వెల్లడించింది.
ముందస్తు అనుమతి లేకుండానే మార్పులు చేశారు.. రిషికొండపై జరుగుతున్న భవన నిర్మాణాల్లో కొన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ అండ్ ఫారెస్ట్ ముందస్తు అనుమతి లేకుండా మార్పులు చేశారని.. కేంద్ర ప్రభుత్వ అధికారుల కమిటీ హైకోర్టుకు సమర్పించిన నివేదికలో తెలిపింది. ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ ఏరియా 9.88 ఎకరాలు కాగా.. మొత్తం 17.965 ఎకరాల్లో నిర్మాణాలు, డంపింగ్ చేపట్టారని పేర్కొంది. ఏడు బ్లాకులు నిర్మించేందుకు అనుమతులు తీసుకున్నారని.. ప్రస్తుతం నాలుగు బ్లాకులు నిర్మిస్తున్నట్లు నివేదికలో వివరించింది. రిషికొండపై జరుగుతున్న భవన నిర్మాణాల్లో కొన్నింటికి కేంద్ర పర్యావరణ అటవీ శాఖ ముందస్తు అనుమతి తీసుకోకుండానే సవరణ చేశారని కమిటీ నివేదికలో తెలిపింది.
కేంద్ర కమిటీ నివేదిక ప్రకారం.. ''రిషికొండపై 9.88 ఎకరాల్లో ఏడు బ్లాకులు నియమించేందుకు సీఆర్‌జడ్‌ను అనుమతి కోరుతూ.. ఏపీటీడీసీ దరఖాస్తు చేసుకుంది. 2021 మే 19న ఏడు బ్లాకులను 19.968 చదరపు మీటర్లలో నిర్మించేందుకు సీఆర్‌జడ్ అనుమతినిచ్చింది. మొత్తం 61 ఎకరాల మేర కొండ ప్రాంతం ఉంది. బ్లాకులు నిర్మించేందుకు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు 2022 అక్టోబర్‌లో ఉత్తర్వులు జారీ చేసింది. నాలుగు బ్లాకులను ప్రస్తుతం నిర్మిస్తున్నారు. స్థలాన్ని వినియోగించుకునే విధానాన్ని మార్చారు. బ్లాకులను అప్‌హిల్ వైపునకు మార్చారు. కేంద్ర పర్యావరణ అటవీశాఖ నుంచి అనుమతి తీసుకున్న పరిధికి మించి నిర్మాణాలు చేపడుతున్నారు. విజయనగర బ్లాక్, కళింగ బ్లాక్, వేంగి, గజపతి బ్లాక్‌లను ప్రస్తుతం నిర్మిస్తున్నారు. చోళ, పల్లవ, ఈస్టరన్ గంగా బ్లాక్‌లను నిర్మిస్తున్నారు. ప్రాజెక్ట్ డెవలప్ ఏరియా 9.88 ఎకరాలు ఉంది. తవ్విన మట్టిని రిషికొండ సదరన్ వైపు, ఇతర ప్రాంతాల్లో డంపింగ్ చేస్తున్నారు. కళింగ, వేంగి బ్లాక్ స్థల పరిధిని పెంచి నిర్మాణాలు చేపడుతున్నారు.'' అని కేంద్ర కమిటీ నివేదికలో తెలిపింది.