ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లంచావతారాలకు సంకెళ్లు!

అవినీతి నిరోధకశాఖ(అనిశా) అధికారులకు సమాచారం అందించే క్రమంలో అందుబాటులోకి తెచ్చిన రాష్ట్ర వ్యాప్త టోల్‌ఫ్రీ నెంబరు ‘14400’ ఆ శాఖ అధికారులకు సరికొత్త అస్త్రంగా మారింది. ఉద్యోగుల అవినీతిపై ఆ టోల్‌ఫ్రీ నెంబరుకు విశాఖ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో ఫోన్లు వెళ్తున్నాయి. ఆ సమాచారం ఆధారంగా అధికారులు దాడులు నిర్వహించి వారి ఆటకట్టిస్తున్నారు. ఫిర్యాదుదారులు ఇచ్చే సమాచారం ఆధారంగా ప్రతి ఫిర్యాదును సమగ్రంగా పరిశీలించి... క్షేత్రస్థాయిలో వాస్తవాలను అధ్యయనం చేసి..... ఉద్యోగుల అవినీతికి ఆధారాలు సేకరించి వారికి తాఖీదులు ఇస్తున్నారు.

By

Published : Dec 9, 2020, 10:26 AM IST

anti corruption day special story
anti corruption day special story

అవినీతిపరులను పట్టుకునేందుకు ‘అనిశా’ అధికారులు తమ వ్యూహాలకు మరింతగా పదును పెడుతున్నారు. విశాఖ నగరంలోని అనిశా కార్యాలయానికి వెళ్లి కొందరు బాధితులు ఫిర్యాదులు చేసేవారు. కొందరు ఫోన్లలో చెప్పేవారు. వాటికి అదనంగా రాష్ట్ర టోల్‌ఫ్రీ నెంబరు నుంచి కూడా పలు ఫిర్యాదు వస్తుండడంతో వాటికి అగ్రప్రాధాన్యం ఇచ్చి మరీ వాస్తవాలు నిగ్గుతేలుస్తున్నారు. టోల్‌ఫ్రీ నెంబరుకు వస్తున్న ఫిర్యాదుల సంఖ్య గణ నీయంగా పెరుగుతుండడంపై అధికారులను మరింతగా దృష్టికేంద్రీకరించారు. అత్యధిక ఫిర్యాదుదారులు తగిన సాక్ష్యాలు సమర్పించకుండా కేవలం సమాచారం మాత్రమే ఇస్తుండడం, బాధితులు కూడా తమ పని పూర్తైతే చాలన్న ధోరణిలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడానికి ముందుకు రాకపోవడం కొంత సమస్యగా మారిందని అధికారులు పేర్కొంటున్నారు.

  • రెవెన్యూ, జీవీఎంసీ, పంచాయతీరాజ్, తదితర విభాగాల ఉద్యోగులపై ఫిర్యాదులు ఎక్కువగా వస్తుండడం గమనార్హం. పలువురు పట్టుబడుతున్నా ఆయా శాఖల్లో గుట్టుచప్పుడు కాకుండా అవినీతి జరుగుతుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
  • అక్రమాస్తుల కేసుల్లో నిందితుల ఆస్తులను జప్తు చేసుకునే విధానం కూడా అమల్లోకి వచ్చింది. కేసు తుది తీర్పు నిందితులకు వ్యతిరేకంగా వస్తే ఆయా ఆస్తులు పూర్తిగా ప్రభుత్వానికే స్వాధీనం చేయకతప్పదు.

వివాదాలెందుకున్న ధోరణి వీడాలి

ఫిర్యాదు చేస్తే ఎక్కడ అది వివాదం అవుతుందోనని చాలామంది భయపడుతుంటారు. ఏమాత్రం భయపడకుండా ఫిర్యాదు చేయడానికి ముందుకు రావాలి. కొందరు డబ్బులు ఇచ్చేసిన తరువాత మా కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. లంచాలు ఇవ్వకముందే ఫిర్యాదు చేయాలన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. లంచం కింద ఇచ్చే మొత్తాన్ని కూడా చట్టప్రకారం తిరిగి బాధితులకు ఇప్పించేస్తాం.

-రంగరాజు, డీఎస్పీ, అవినీతి నిరోధకశాఖ

తగిన రుజువులతోనే దాడులు


వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన పలువురు అధికారులు, ఉద్యోగుల అక్రమాస్తులు, అవినీతి ఉదంతాలపై ఫిర్యాదులు ఎక్కుగానే వస్తున్నాయి. అవినీతిపరులపై ఫిర్యాదు చేయాలన్న స్పృహ గతంతో పోలిస్తే ఇటీవలి కాలంలో బాగానే పెరిగింది. ఫిర్యాదుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నాం. ఉద్యోగుల అవినీతిని నిరూపించే తగిన సాక్ష్యాలు సంపాదిస్తేగానీ వారికి శిక్షపడదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆయా సాక్ష్యాలను సమకూర్చుకున్న అనంతరం దాడులు చేస్తున్నాం.

-షేక్‌ షకీలా భాను, అదనపు ఎస్పీ, అవినీతి నిరోధకశాఖ

ABOUT THE AUTHOR

...view details