మన్యం వీరుడు అల్లూరి ఉద్యమ స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకుని లక్ష్య సాధనలో ముందుకెళ్లాలని అరకు ఎంపీ గొడ్డేటి మాధవి పేర్కొన్నారు. విశాఖ జిల్లా చింతపల్లి పోలీసు స్టేషన్‌పై అల్లూరి సీతారామరాజు దాడి ఘటన వంద ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తపాలాశాఖ ప్రత్యేక పోస్టల్ కవర్‌ను రూపొందించింది. ఈ కవర్‌ను నాటి చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన చింతపల్లిలో ఆదివారం పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మితో కలిసి ఎంపీ ఆవిష్కరించారు.
అంతకు ముందు.. అల్లూరికి నివాళి అర్పిస్తూ చింతపల్లిలో ర్యాలీ నిర్వహించారు. పోలీసు స్టేషన్లపై సాయుధ దాడుల సమయంలో సమాచార బట్వాడాకు మిరప కాయల్లో లేఖలు పెట్టి వాటిని బాణాలకు గుచ్చి విల్లంబులతో అల్లూరి సీతారామరాజు వినియోగించే వారని.. అవే ‘మిరపకాయ టపా’గా చరిత్రలో నిలిచిపోయాయని తపాలాశాఖ డైరెక్టర్ జనరల్ వెంకటేశ్వర్లు గుర్తు చేశారు. దానికి గుర్తుగా తపాలా శాఖ అల్లూరి పేరిట ప్రత్యేక కవర్లను ముద్రించిందని తెలిపారు. చింతపల్లి సర్పంచి పుష్పలత, ఏపీ వైద్య సలహా మండలి సభ్యులు నర్సింగరావు, స్థానికులు పాల్గొన్నారు.