అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన కొప్పరపు సురేష్... స్టిక్కరింగ్, ఫ్లెక్స్ ప్రింటింగ్ దుకాణం నిర్వహిస్తున్నారు. వీరి కుమార్తె హనీషా ఇటీవల పదో తరగతి పూర్తి చేసి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలోకి అడుగిడుతోంది. చదువుతో పాటు ఇతర అంశాల్లోనూ ప్రత్యేక ఆసక్తి కనబరిచే ఈ చిన్నారి.... ఇప్పటివరకు పది కళల్లో మేటిగా నిలిచి ప్రశంసలు అందుకుంటోంది. సొంతంగా పాటలు రాసి... దానికి సంగీతం అందించగలదు. భరతనాట్యం, కూచిపూడి, జానపద నృత్యాలు చేయగలదు. వీటికి తోడు చిత్ర లేఖనం, బ్యాడ్మింటన్ వంటి వాటిల్లోనూ ప్రతిభ చూపిస్తూ.. మల్టీ టాలెంట్ అనే పదానికి సాక్ష్యంలా మారింది.
ఎన్నో కళల్లో మేటి... ఈ చిన్నారి సవ్యసాచి - olympic
ఒక అంశంలో ప్రతిభ చూపిస్తేనే సత్తా చాటారు అంటాం. అదే రెండు, మూడు కళల్లో ప్రతిభ కనబరిస్తే ఔరా అంటాం. మరి పదికి పైగా కళలను ఒకరు అవపోసాన పడితే ఏమంటాం?. పదో తరగతి పూర్తి చేసిన హనీషా అనే చిన్నారి... క్రీడలు, నృత్యాలు, సంగీతం, సాహిత్యం ఇలా ఎన్నో రంగాల్లో రాణిస్తోంది. అందరి చేత 'హనీ' ఈజ్ ద బెస్ట్ అనిపించుకుంటోంది.
ఎన్నో రంగాల్లో ప్రతిభ
హనీషా ఏడో తరగతి చదివే సమయంలో బ్యాడ్మింటన్ ఆడటం ప్రారంభించింది. ఇప్పటి వరకు జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతగా నిలిచి పతకాలు, ప్రశంసా పత్రాలు అందుతుంది. ఒకసారి జాతీయ పోటీలకు కూడా ఎంపికైంది. త్వరలోనే అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు ప్రస్తుతం హైదరాబాద్‌లో శిక్షణ తీసుకుంటోంది. సాధారణంగా అందరూ కుడి చేతితో రాస్తుంటారు. కొద్దిమందికి ఎడమ చేయి అలవాటు ఉంటుంది. హనీషా మాత్రం సవ్యసాచిలా రెండు చేతులతో ఒకేసారి రాయగలదు. చేతిరాతలో చిన్నపాటి వ్యత్యాసానికి తావు ఇవ్వదు. సంగీతంపైనా ఆసక్తి పెంచుకున్న హనీషా... ఇప్పటివరకు ఆంగ్ల, తెలుగు బాషల్లో 10కి పైగా పాటలతో పాటు 120 కొటేషన్స్ రాసింది. తన పాటలకు తానే ట్యూన్ కట్టుకుంటుంది. అంతే కాదు అద్భుతంగా పాడుతుంది కూడా. కంప్యూటర్ కీబోర్డ్‌లోని అన్ని అక్షరాలను ఒక నిమిషం ఏడు సెకన్ల వ్యవధిలో హనీషా టైప్ చేయగలదు. అంతేకాకుండా ఇప్పటి వరకు నృత్య పోటీల్లో పదికి పైగా బహుమతులు, ప్రశంసాపత్రాలను అందుకుంది.
అదే తన లక్ష్యం
ఒలంపిక్స్‌కి అర్హత సాధించి బ్యాడ్మింటన్ పోటీల్లో దేశానికి స్వర్ణం సాధించాలనేది హనీషా లక్ష్యం. దీనికోసం ఎనిమిదో తరగతి నుంచి పాఠశాలకు వెళ్లకుండా బ్యాడ్మింటన్ శిక్షణ తీసుకుంటోంది. తొమ్మిది, పది తరగతులను ప్రయివేటుగా పూర్తి చేసింది. ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షలలో హనీషా.. 9.8 గ్రేడు సాధించింది.