Arbitrary and illegal excavation of soil: విజయవాడ నగరానికి కూత వేటు దూరం. వందల టిప్పర్లు రేయింబవళ్లు తిరుగుతున్నాయి.. దాదాపు 150 ఎకరాల్లో.. రెండు తాటిచెట్ల లోతున తవ్వకాలు.. అసైన్‌మెంట్, అటవీ, పోరంబోకు భూములు, పోలవరం కట్టలు.. ఇలా ఏ ఒక్కదాన్నీ వదలడంలేదు.. గ్రామస్తులు అడ్డుకుంటే.. ‘మేం ఎవరోతెలుసా.. ఎంపీ మనుషులం.. ఫలానా మంత్రి అనుచరులం..!’ అంటూ బెదిరింపులు. అధికారులకు సమాచారం ఇచ్చినా ఉలకరు.. పలకరు..! వైఎస్సార్సీపీప ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించే స్పందనలో ఫిర్యాదు చేసినా.. మీ విజ్ఞప్తి అందింది.. పరిశీలిస్తున్నాం..! అనే సమాధానం తప్ప చర్యలు శూన్యం.
సీనరేజీ చెల్లించక ఖజానాకు చిల్లు..: మట్టి తవ్వకాలు జరిపితే.. గనుల శాఖకు రూ.45చొప్పన, జలవనరుల శాఖకు రూ.90 చొప్పున ఒక ఘనపు మీటరు మట్టికి సీనరేజీ చెల్లించాలి. ఇవేవీ లేకుండా తరలిస్తున్నారు. ఒక లారీ మట్టి(25టన్నులు) కనీసం రూ.10వేల వరకు నిర్మాణ సంస్థలకు విక్రయిస్తున్నారు. కొన్నాళ్లుగా 1.50లక్షల లారీల మట్టి వెలికి తీసి ఉంటారని భావిస్తున్నారు. ఒక్కో లారీ మట్టి రూ. పది వేల చొప్పున అమ్ముకోగా రూ. 150 కోట్లు అక్రమార్కుల జేబుల్లోకి వెళ్ళి ఉంటాయని భావిస్తున్నారు. పోలవరం కట్టలపై గడిచిన ఐదారు నెలల్లో రూ.50కోట్లపైగా మట్టి తవ్వకాలు జరిగాయి. ఈ లారీలకు ఆయా నిర్మాణ సంస్థల పేరుతో స్లిప్పులు అంటించడం.. అధికారులు పట్టుకుంటే.. ప్రజాప్రతినిధుల నుంచి ఉన్నతాధికారులకు సందేశాలు రావడం షరా మామూలైంది.
ఇరిగేషన్ అధికారుల సంతకాలు ఫోర్జరీా?..: పోలవరం ఈఈ కే. శ్రీనివాసరావు తాము ఎవ్వరికి అనుమతి ఇవ్వలేదని చెబుతున్నారు. ఆయన పేరుతోనే అనుమతి పత్రాలు చూపిస్తున్నారు. అంటే ఇరిగేషన్ అధికార్ల సంతాలను ఫోర్జరీ చేసి మట్టి తరలింపులు సాగిస్తున్నారా అన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో మట్టి తవ్వకాలు జరిపి తరలిస్తున్న వ్యవహారంలో అనుమతి పత్రాలను అధికార్లు ఎందుకు తనిఖీ చేయరన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికే దాదాపు రూ.200 కోట్ల మట్టిని తవ్వేశారని అంచనా. జాతీయ రహదారులు సంస్థ ఆధ్వర్యంలో రెండు మెగా సంస్థలు నిర్మాణం చేస్తున్న ఆరువరసల విజయవాడ బైపాస్ నిర్మాణానికి సరఫరా చేస్తున్నారు.