LOKESH FIRES ON CM JAGAN : యువగళం దెబ్బతో తాడేపల్లి ప్యాలెస్ నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బయటకు వస్తున్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో 29వ రోజు లోకేశ్ పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా తొండవాడలో లోకేశ్ బహిరంగ సభ నిర్వహించారు.
రాయలసీమ బిడ్డగా చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్.. రాయలసీమ ద్రోహిలా ప్రవర్తిస్తున్నారని.. నారా లోకేశ్ దుయ్యబట్టారు. సీఎం జగన్.. కడప ఉక్కు కర్మాగారాన్ని కేవలం శంకుస్థాపనలకే పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. అప్పర్ భద్ర ప్రాజెక్టుపై సీఎం సహా రాయలసీమ ప్రజాప్రతినిధులెవరూ అడ్డుచెప్పకపోవడం.. వైఎస్సార్సీపీ వైఖరికి నిదర్శనమన్నారు. నాలుగేళ్లు ఇంటికే పరిమితమైన జగన్ పల్లెనిద్రకు వస్తారట అని లోకేశ్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో యువతకు ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాలన్నీ భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సొంతవారికి లబ్ధి చేకూర్చేందుకే సిమెంట్ ధరను మూడుసార్లు పెంచారని విమర్శించారు.
"సీఎం జగన్ రాయలసీమ బిడ్డా అన్నాడు. కానీ రాయలసీమకు పట్టిన శని జగన్ రెడ్డి. నేను మీకు మూడు ఉదాహరణలు ఇస్తా. ఆయన కడపలో ఉక్కు పరిశ్రమకు రెండు సార్లు శంకుస్థాపన చేశాడు. మొదటి శంకుస్థాపన సమయంలో యువతకు 20వేల ఉద్యోగాలు ఇస్తానన్నాడు. కానీ రెండోసారి శంకుస్థాపన చేసినప్పుడు ఉద్యోగాల సంఖ్య ఏకంగా 6వేలకు తగ్గించాడు. ఇది ఆయన కడప జిల్లాకు చేసిన న్యాయం"-నారా లోకేశ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి