ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

YSRCP Leader Anarchists in Tirupati District: కన్నుపడిందంటే అంతే.. ఆయన ముందు రాహుకేతువులైనా దిగదుడుపే..

YSRCP Leader Anarchists in Tirupati District: ఆ జిల్లాలోని ఆ ప్రజాప్రతినిధి.. రాహుకేతువుల్ని మించిన పాపగ్రహం! పారిశ్రామికవేత్తల నుంచి ప్రతిపక్షాల వరకూ అంతా ఆయన పీడితులే. కుమార్తెకు రెండు మండలాలు, అనుచరులకు మరో రెండు మండలాలను.. సొంత జాగీరులా రాసిచ్చారు ఆ నేత. బదిలీలు, భూకబ్జాలు, సెటిల్‌మెంట్లన్నీ వారి కనుసన్నల్లోనే నడిపిస్తున్నారు. అధికారుల సహకారంతో ప్లాట్ల కబ్జా.. అనుచరుల పేర్లతో పట్టాలు దోచేయడం చేస్తున్నారు. నిత్యం వందల ట్రక్కుల్లో ఇసుక తరలింపుతో పాటు అంతులేని స్థాయిలో మట్టిని దోపిడీ దోచేస్తున్నారు. ఆఖరికి ముక్కంటి ఆలయంలో పూజల నుంచి పార్కింగ్‌ వరకూ.. వసూళ్ల రూపంలో పిండేస్తారు. అయినా ఆ ప్రజాప్రతినిధి వైపు ఏ పోలీసు అధికారీ కన్నెత్తి చూడరు. చూస్తే అంతే సంగతులు. అంతలా ఆయన ఆ ప్రాంతాన్ని గుప్పిట్లో పెట్టుకున్నారు.

YSRCP_Leader_Anarchists_in_Tirupati_District
YSRCP_Leader_Anarchists_in_Tirupati_District

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 30, 2023, 7:37 AM IST

YSRCP Leader Anarchists in Tirupati District: కన్నుపడిందంటే అంతే.. ఆయన ముందు రాహుకేతువులైనా దిగదుడుపే..

YSRCP Leader Anarchists in Tirupati District: తిరుపతి జిల్లాలో బాగా నోరున్న ఆ ప్రజాప్రతినిధి ముందు.. పాపగ్రహాలైన రాహుకేతువులూ దిగదుడుపే. కన్నుపడిన ఏ స్థలాన్నీ వదిలిపెట్టరు. ఇసుక, మట్టిదోపిడీ నుంచి రేణిగుంట ప్రాంతంలో పారిశ్రామికవేత్తల నుంచి వాటాల వసూళ్ల వరకూ అన్నింటిలో మహాదిట్ట. ఆయన తన అనుచరుల ద్వారా కబ్జాచేసి ప్లాట్లు వేసి అమ్మిన భూముల విలువే వందల కోట్లకు చేరి ఉంటుందని అంచనా.

సువర్ణముఖి నది నుంచి రోజూ వందల ట్రాక్టర్ల ఇసుక, దేవస్థాన భూముల నుంచి నిత్యం వందల టిప్పర్లతో మట్టిదోపిడీ ద్వారా భారీ మొత్తంలో వెనకేసుకుంటున్నారు. ఎవరైనా అడ్డుపడితే కేసులు పెట్టించి, వేధించి దారికి తెచ్చుకోవడంలో ఆయన్ను మించినవారు లేరు. రాహు, కేతు దోషనివారణ పూజల కోసం శ్రీకాళహస్తి దేవస్థానానికి వచ్చే భక్తులనూ వదలకుండా.. మండపాల వారీగా మనుషుల్ని పెట్టి దోచుకుంటారు.

పేరుకు ఆయన ప్రజాప్రతినిధి అయినా.. నియోజకవర్గానికి నిరంకుశ రాజులానే వ్యవహరిస్తుంటారు. ఏ పని కావాలన్నా.. ఆయన అనుచరులను సంప్రదించాలి. ఆయన ఆమోదం లేకపోతే నెలలు, ఏళ్లు గడచినా దస్త్రాలు మూలన పెట్టేస్తారు. రేణిగుంట, తొట్టంబేడు మండలాల్ని తన కుమార్తెకు కట్టబెట్టారు. అక్కడ బదిలీల నుంచి భూకబ్జాలు, సెటిల్‌మెంట్లన్నీ ఆమె కనుసన్నల్లో జరగాల్సిందే. ఆమె మాటను కాదని ఎవరూ ఏ పనీ చేయలేరు.

YCP Leaders Attacked on Retired Army Employee : పెచ్చుమీరుతున్న వైసీపీ నేతల ఆగడాలు.. విశాంత్ర ఆర్మీ ఉద్యోగిపై రాడ్లు, కత్తులతో దాడి

ఏర్పేడు వ్యవహారాలన్నీ సోదరుడి వరసయ్యే వ్యక్తి చూస్తారు. ఆయన ఆమోదం లేనిదే మండలంలోని అధికారులు సంతకాలు పెట్టే పరిస్థితి లేదు.సన్నిహితుడైన ఒక విలేకరికి శ్రీకాళహస్తి మండలాన్ని అప్పగించారు. మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలు, ఇతరత్రా ఏ పని కావాలన్నా ఆయనే చూస్తారు. మాట విననివారిపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులు పెట్టి, చివరకు తమ వద్దకు రప్పించుకోవడంలో ఆరితేరారు. విలేకరి పుట్టినరోజు సందర్భంగా గతంలో స్కూటీ ఇచ్చిన ముఖ్యనేత.. ఇటీవల బొలెరో వాహనం ఇచ్చారు.

ఖరీదైన ఖాళీస్థలాల్లో ఈ ప్రజాప్రతినిధి, ఆయన అనుచరులు జెండా పాతేస్తారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలిరోజుల్లో తన బావమరిది ద్వారా ఈ వ్యవహారాలన్నీచక్కబెట్టేవారు. తర్వాత ఇద్దరి మధ్య పంపకాల్లో తేడా వచ్చింది. దీంతో కొన్నాళ్లుగా ఎవరి దందా వారిదే. ప్రభుత్వ భూములు, కాల్వలు, నదీ తీర ప్రాంతాలను కబ్జాచేస్తున్నారు. ఖాళీ భూముల సర్వే నంబర్లు, వారసుల వివరాలిస్తూ.. తమ అక్రమాలకు సహకరించే రెవెన్యూ ఉద్యోగులకు పదోన్నతుల్ని బహుమానంగా ఇస్తారు. మండలాల్లో తహసీల్దార్లకు బదులు ఇన్‌ఛార్జుల ఆధ్వర్యంలోనే పాలన నడిపిస్తుంటారు.

YCP MLA Meda Mallikarjun Reddy Land Mafia: కబ్జా చేసి సక్రమమనే ముద్ర.. వైసీపీ ఎమ్మెల్యే వందల ఎకరాలు స్వాహా

శ్రీకాళహస్తిలోని రాజీవ్‌నగర్‌ కాలనీలో సుమారు 2వేల ప్లాట్లను మున్సిపల్, రెవెన్యూ ఉద్యోగుల సహకారంతో ఒక్కోటి 5 నుంచి 7 లక్షలకు అమ్ముకున్నారు. పారిశ్రామిక ప్రాంతంగా అభివృధ్ధి చెందుతున్న రేణిగుంట మండలంలో ఈ నేత భూ ఆక్రమణలు, అమ్మకాలకు అంతే లేదు. తహసీల్దారు కార్యాలయం వెనక 8 ఎకరాల భూమిని ప్లాట్లు వేసి అమ్మేయడంలోనూ ఈ నేత పాత్ర ఉందని చెబుతారు. తిరుపతికి చెందిన ఒక నేతను ఇన్‌ఛార్జిగా పెట్టి కరకంబాడి తారకరామనగర్‌లో సుమారు 6వేలకు పైగా ప్లాట్లలో 600కు పైగా ప్లాట్లను వైకాపా కార్యకర్తలకు కట్టబెట్టుకున్నారు. రేణిగుంటలోని ఎల్లమండ్యంలో సుమారు 30 ప్లాట్లను ఒక్కోటి 5లక్షల చొప్పున విక్రయించారు.

కుర్రికాలువ, గాజులమండ్యం, పాతరేణిగుంట, కరకంబాడి, వెంకటాపురంలోని ఖాళీ భూముల్లో తన అనుచరుల ద్వారా ప్లాట్లు వేయించి అమ్మించి.. వాటాలు అందుకున్నారని కార్యకర్తలే చెబుతుంటారు. ఈయన అవినీతిని అడ్డుకున్న అధికారులపై సస్పెన్షన్, బదిలీవేట్లు తప్పలేదు. ఏర్పేడులో వివాదాస్పద భూముల్ని అనుచరుల ద్వారా తక్కువ ధరకు కొనిపించి.. వాటిని తిరిగి జగనన్న కాలనీలకు విక్రయించారు. ఈ వ్యవహారంలో వంద కోట్లకు పైగానే వెనకేసుకున్నట్లు ఆరోపణలు వినిపించాయి.

YSRCP Leader Anarchists in Parchur: పర్చూరులో శ్రుతిమించిన అధికార అరాచకం.. విధులు నిర్వహంచాలంటే హడలిపోతున్న ప్రభుత్వాధికారులు!

శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలోనూ.. ముఖ్యనేత ఆగడాలకు అంతులేదు. అక్కడ పనిచేసే సేవకుల్లో అత్యధికులు ప్రజాప్రతినిధి అనుచరులే. రాహు, కేతు పూజలతో పాటు టికెట్‌ లేకుండా అడ్డగోలుగా దర్శనాలు చేయించి, వీలైనంతగా దండుకుంటారు. ఎవరైనా అడ్డుచెబితే ఉద్యోగాల నుంచి తొలగించడం, లేదంటే బదిలీ చేయిస్తుండటంతో ఎవరూ మాట్లాడరు. కార్ల పార్కింగ్, సెల్‌ఫోన్లు, లగేజి కౌంటర్లలో అడ్డగోలు దోపిడీ చేస్తున్నా.. ఎవరూ అడగరు. ఆలయ టెండర్ల నుంచి, గోవులకు పచ్చిగడ్డి వరకు అన్నీ ఆయన కనుసన్నల్లో జరగాల్సిందే.

సువర్ణముఖి నది ఇసుకతో.. ప్రజాప్రతినిధి ప్రతి నెలా కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. ఒక్కోదానికి 4వేల చొప్పున కుట్రమంగళం రీచ్‌ నుంచి రోజూ వందల ట్రక్కుల్లో తరలిస్తున్నారు. శ్రీకాళహస్తి, రేణిగుంట, ఏర్పేడు, తొట్టంబేడు మండలాల్లో నదీ తీరమంతా గోతులు పెట్టి తవ్వేస్తున్నా.. అడిగే నాథుడు లేరు. రాత్రంతా పొక్లెయిన్లు పనిచేస్తూనే ఉన్నా.. అధికారులెవరూ పట్టించుకోరు. ప్రజాప్రతినిధివి కాకుండా వేరే వాహనం ఇసుకతో రోడ్డెక్కడానికి వీల్లేని పరిస్థితి.

మట్టి మాఫియాలోనూ ప్రజాప్రతినిధికి వాటాలున్నాయి. ముక్కంటి దేవస్థానానికి చెందిన 45ం నుంచి 500 ఎకరాల కొండను పిండి చేసి.. గుంతలమయంగా మార్చారు. రహదారులు నిర్మించే గుత్తేదారులకు వందల టిప్పర్లలో తరలిస్తున్నారు. ఒక్కో టిప్పర్‌కు 7,500 వరకు వసూలు చేస్తారు. ప్రభుత్వభూముల్లోనూ ఇష్టానుసారంగా మట్టి తవ్వకాలు చేస్తూ.. కోట్లు ఆర్జిస్తున్నారు.

Illegal Layouts: ఎవడ్రా మనల్ని ఆపేది.. అక్రమ లేఅవుట్లతో రెచ్చిపోతున్న వైఎస్సార్​సీపీ నాయకులు

పారిశ్రామికవేత్తలనూ ఈ ప్రజాప్రతినిధి వదలరు. వారిని వేధించి వాటాలు దండుకుంటున్నారు. రాచగున్నేరి సమీపంలోని ప్రైవేటు కంపెనీలపై ఒత్తిళ్లు తేవడంతో.. ఈ పంచాయితీ కేంద్రప్రభుత్వం వరకు వెళ్లింది. ఈయనపై రాష్ట్ర ఉన్నతాధికారులు అసంతృప్తి వ్యక్తం చేసినా తీరులో మార్పు లేదు.

భూకబ్జాలు, అమ్మకాల్లో తనకు సహకరించే అధికారులకు.. అండా, దండా ఆయనే. నియోజకవర్గంలో తహసీల్దార్లను పంపేసి వారి స్థానంలో డిప్యూటీ తహసీల్దార్లను ఇన్‌ఛార్జులుగా చేసుకుని ఎంచక్కా భూములు స్వాహాచేస్తున్నారు. రేణిగుంట మండలంలో ఇటీవల భూముల కుంభకోణంలో ఒక తహసీల్దార్‌ ఆయనకు అందించిన సహకారం అంతా ఇంతా కాదు. అందుకే ఆయనకు సంఘ నేతగా పనిచేసే అవకాశం దక్కింది. భూ కుంభకోణాల ఆరోపణలపై ఆయన్ను ప్రభుత్వం బదిలీ చేసినా.. ప్రజాప్రతినిధి ఆయన్ను వెనకేసుకొచ్చి తన ప్రాంతంలోనే పోస్టింగ్‌ ఇప్పించుకున్నారు.

సొంత పార్టీలో తన మాట వినని వారితోపాటు.. ప్రతిపక్షంలో చురుగ్గా వ్యవహరించేవారంతా ప్రజాప్రతినిధికి గిట్టనివారే. అక్రమ కేసులతో వారిని భయపెట్టి తన దారికి తెచ్చుకుంటారు. టీడీపీకి చెందిన 35 మందిపై అక్రమ కేసులు పెట్టించడం చర్చనీయాంశం అయింది. పాల సంఘం ఎన్నికల్లో నామినేషన్‌ వేస్తారని.. టీడీపీ నేతపై రాళ్లదాడి చేయించారు. జనసేనలో ముఖ్యనేతలపైనా కేసులు పెట్టించారు. పోలీసులు, అధికారుల్ని ఉపయోగించి నియోజకవర్గంలో తన అక్రమాలకు అడ్డుపడే నేతలు, వారి అనుచరులపై ఉక్కుపాదం మోపుతూ.. అరాచకాలకు తెగబడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details