Nara Lokesh 26th Day Padayatra: టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ప్రతి యువకుడికి ఉద్యోగం వచ్చేలా చర్యలు తీసుకుంటుందని యువనేత లోకేశ్ తెలిపారు. యువత భవిష్యత్ కోసమే యువగళం పాదయాత్ర నిర్వహిస్తున్నానని తెలిపారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా 4 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర పూర్తి చేస్తానని లోకేశ్ స్పష్టం చేశారు. తిరుపతి నగర శివారు తాను బస చేసిన ప్రాంతంలో ఏర్పాటు చేసిన హలో లోకేశ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐఐఎం ప్రొఫెసర్ రాజేష్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన యువతీ యువకులు, నిరుద్యోగులు పాల్గొన్నారు. సాధారణ సమావేశాలకు భిన్నంగా హలో లోకేశ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మైదానం మధ్యలో వేదికను ఏర్పాటు చేయగా... వేదికకు మూడు వైపులా విద్యార్ధులు ఆశీనులయ్యేలా ఏర్పాటు చేశారు. లోకేశ్ వేదికకు చేరుకుంటున్న సమయంలో కార్యక్రమానికి హజరైన యువతీ, యువకులు కేరింతలు కొడుతూ స్వాగతం పలికారు.
ఇప్పటి వరకు 350 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశానని.. ప్రజల ఆశీర్వాదంతో నాలుగు వేల కిలోమీటర్లు పూర్తి చేస్తానని లోకేశ్ తెలిపారు. ఉన్నత కుంటుంబం నుంచి వచ్చినా.. బడుగు బలహీన వర్గాల సమస్యలపై పూర్తి అవగాహన ఉందని వివరించారు. వైకాపా నేతలు తనపై చేస్తున్న విమర్శలు పట్టించుకోనని రాష్ట్ర అభివృద్ది మాత్రమే తన లక్ష్యమన్నారు. తాను ఐటీ మంత్రిగా ఉన్న సమయంలో చిత్తూరు జిల్లాకు జోహో, సెల్ కాన్, టీసీఎల్, డిక్సన్ వంటి పరిశ్రమలతో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించామని లోకేశ్ తెలిపారు. నాలుగు వేల కిలోమీటర్ల లక్ష్యంగా తాను చేపట్టిన యువగళం పాదయాత్రలో ఇప్పటి వరకు 9 శాతం పూర్తి చేశానని ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా... యువత కోసం వాటన్నింటిని అధిగమించి ముందుకు సాగుతున్నానన్నారు.