Corruption in Aarogyasri Scheme : ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్సలు చేసి వైద్య సేవలు అందించిన ఆసుపత్రులు.. కోట్ల రూపాయల బకాయిలతో ఇబ్బందులు పడుతుంటే.. తిరుపతి రుయా ఆసుప్రతిలో మాత్రం ఆరోగ్యశ్రీ ఆసరా నిధులను పక్కదారి పట్టించారు. నర్సింగ్ సిబ్బంది, వైద్యుల సహకారంతో డేటా ఎంట్రీ ఆపరేటర్లు అక్రమాలకు పాల్పడి 13 లక్షల రూపాయలు స్వాహా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. తిరుపతిలోని జీవకోనకు చెందిన మునెమ్మ అనే మహిళను.. పక్షవాతం రోగిగా ఓపీ తీసుకుని మెడిసిన్ వార్డులో చేర్పించి అక్రమాలకు పాల్పడ్డారు. రెండు రోజుల తర్వాత డిశ్చార్జి చేసినట్లు దస్త్రాలు సృష్టించి మందుల ఆసరా నిధులు 30 వేల రూపాయలు మునెమ్మ ఖాతాకు జమ చేశారు. బ్యాంకుకు తీసుకెళ్లి నగదు డ్రా చేసి ఆమె చేతితో 10 వేల రూపాయలు పెట్టి మరో ఇరవై వేల రూపాయలు నొక్కేశారు. ఇలా ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలలో 44 మందిని ఆసుపత్రిలో చేర్చి.. ఒక్కొక్కరి పేరుమీద ముప్పై వేల రూపాయలు చొప్పున ఆరోగ్యశ్రీ ఆసరా నిధులు 13 లక్షల రూపాయలు స్వాహా చేశారు.
రుయాలో ఆరోగ్యశ్రీ పథకం కింద జరిగే శస్త్ర చికిత్సల నమోదుకు.. డేటా ఎంట్రీ ఆపరేటర్లను పొరుగుసేవల కింద రుయా యాజమాన్యం నియమించుకుంది. కాల పరిమితి పూర్తయినా అనధికారికంగా కొందరు వైద్య విభాగాధిపతులు.. ఐదుగురు డీటీవోలను కొనసాగించారు. ఇందులో కొంతమంది డీటీవోలు చేతివాటం చూపించారు. కొందరు వైద్యులు, ఆరోగ్య మిత్రల సహకారంతో రోగులు కానివారిని రుయాకు తీసుకొచ్చి పక్షవాతానికి గురైనట్లు.. ఆస్పత్రిలో చేర్చుకుని చికిత్స అందిస్తున్నట్లు ఆరోగ్యశ్రీలో నమోదు చేశారు. అప్పటికే పక్షవాతానికి గురైన రోగికి వైద్యులు సూచించే వైద్యం తాలూకు కేసు షీట్లలో పేరు, ఓపీ నంబరు, బార్ కోడ్ తొలగించి నకిలీ రోగుల వివరాలు పొందుపరిచారు. పాత సీటీ స్కాన్ రిపోర్టులో బార్ కోడ్ దిద్దేసి అప్లోడ్ చేశారు. దీంతో ఆరోగ్యశ్రీ ట్రస్టు అనుమతులు మంజూరు కావడం.. డిశ్చార్జ్ అనంతరం రోగి బ్యాంకు ఖాతాకు 30 వేల రూపాయలు ఆరోగ్య ఆసరా జమ అయ్యేది.